Online Funeral: ఆ మధ్య తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది . వేగంగా వచ్చిన వాహనం ఒక కోతిని ఢీకొట్టింది. ఆ కోతి చనిపోయింది. దాదాపు ఆ రోడ్డు మీద 200 వరకు కోతులు గుమి గూడాయి. చనిపోయిన ఆ కోతిని పట్టుకొని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో వేశాయి.
చూసేవాళ్ళకు ఆ దృశ్యం మామూలుగా ఉన్నప్పటికీ.. తమతోపాటు ఇన్నాళ్లపాటు జీవించిన ఒక జీవిని తోటి జీవులు ఎలా తీసుకెళ్లాయో.. అది చనిపోతే ఎంత బాధ పడ్డాయో ఆ దృశ్యం కళ్ళకు కట్టింది. అంతేకాదు, తోటి జీవి చనిపోతే ఆ బాధ ఎలా ఉండాలో మనుషులకు చూపించాయి కోతులు. కోతి నుంచి రకరకాలుగా అభివృద్ధి చెంది.. అత్యధిక మేధస్సు కలిగిన జీవిగా రూపాంతరం చెందిన మనిషి మాత్రం.. హీనంగా మారిపోతున్నాడు..
సభ్య సమాజంలో రోజురోజుకు మనుషుల మధ్య ప్రేమ తగ్గిపోతోంది. అనుబంధం కాలగర్భంలో కలిసిపోతుంది. కేవలం మనుషులకు మాత్రమే సొంతమైన ఆప్యాయత విలుప్తమవుతోంది. అనురాగం.. అనుబంధం మాయమైపోతుంది.. చివరికి తోటి మనుషులు చనిపోతే అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని పరిస్థితి ఏర్పడుతోంది.. కడుపున పుట్టిన కుమార్తెలు.. కుమారులు తల్లిదండ్రుల అంత్యక్రియలకు దూరంగా ఉంటున్నారంటే.. ఆన్లైన్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
హర్యానా రాష్ట్రంలో సానిపట్ ఏరియాలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. అతనికి పిల్లలు కూడా ఉన్నారు. వారు వేరే ప్రాంతాలలో సెటిల్ అయ్యారు. ఆ వ్యాపారవేత్త అనారోగ్యంతో చనిపోయాడు. భారీగా సంపాదించినప్పటికీ కన్న పిల్లలు దగ్గరగా లేకపోవడంతో వృద్ధాశ్రమంలో చేరాడు. ఒంటరితనంతో బాధపడుతూ కన్నుమూశాడు. కుమార్తెలు కన్న తండ్రి కడసారి చూపు కూడా రాలేకపోయారు. చివరికి అంత్యక్రియలను మొబైల్ ఫోన్లో ఆన్లైన్లో చూశారు. వీడియో కాల్ ద్వారా ఆ వ్యవహారం చూసి సరిపెట్టుకున్నారు. అంతేకాదు తమ తండ్రి చివరి ఖర్చులకు కేవలం 5100 మాత్రమే పంపి.. తన బాధ్యత తీరిపోయిందని భావించారు..
కన్న పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకురావడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ జీవితాలను ధారపోస్తారు. కానీ చివరి ప్రయాణంలో కన్న పిల్లలు తల్లిదండ్రులకు తోడుగా ఉండలేకపోతున్నారు.. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి.. వ్యాపారాత్మకమైన బతుకులు బతుకుతూ.. కోట్లు సంపాదించి.. ఉన్నత హోదాలో స్థిరపడి.. చివరికి కన్నవారి రుణం కూడా తీర్చుకోలేని చదువులేందుకు.. ఆ సంస్కారం లేని బతుకులేందుకు.. అంతిమక్షణాలలో టెక్నాలజీ అందించే డిజిటల్ దృశ్యాలు.. ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్లు.. కన్న పేగు ప్రేమను చూపిస్తాయా.. తల్లిదండ్రుల ప్రేమకు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయా.. బతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకోవాలి. వారిని ఆదరించాలి. చివరి ఘడియలలో తోడుగా నిలబడాలి. అది పిల్లల కనీస ధర్మం. కనిపించిన వారిని ఓల్డ్ ఏజ్ హోమ్లకు పరిమితం చేయడం.. చివరికి వారి చావును కూడా వీడియో కాల్స్ ద్వారా చూడడం.. మమకారాన్ని తెంచేసుకోవడం అత్యంత ఘోరం.. మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణం..
బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే… pic.twitter.com/CCMMyqFMhl
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 5, 2026