ఆ తప్పిదం వల్లే.. ఇంతటి భారీ మూల్యం

చత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో బలగాలు ఏ స్థాయిలో ప్రాణాలు కోల్పోయాయో చూశాం. అయితే.. ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగడానికి కారణాలేంటి..? అందుకు దారితీసిన పరిస్థితులేంటి..? ఆపరేషన్‌లో ఎక్కడ లోపం జరిగి ఉంటుంది..? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే.. మావోయిస్టుల కార్యకలాపాల అణచివేతలో విశేష అనుభవం ఉన్న తెలంగాణ నిఘా విభాగం ఈ ఉదంతంపై కీలక సమాచారం సేకరించింది. సీఆర్పీఎఫ్‌ జవాన్ల బృందం గంటల కొద్దీ ఒకే ప్రాంతంలో వేచి ఉండడంతోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి […]

Written By: Srinivas, Updated On : April 8, 2021 4:14 pm
Follow us on


చత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో బలగాలు ఏ స్థాయిలో ప్రాణాలు కోల్పోయాయో చూశాం. అయితే.. ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగడానికి కారణాలేంటి..? అందుకు దారితీసిన పరిస్థితులేంటి..? ఆపరేషన్‌లో ఎక్కడ లోపం జరిగి ఉంటుంది..? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే.. మావోయిస్టుల కార్యకలాపాల అణచివేతలో విశేష అనుభవం ఉన్న తెలంగాణ నిఘా విభాగం ఈ ఉదంతంపై కీలక సమాచారం సేకరించింది.

సీఆర్పీఎఫ్‌ జవాన్ల బృందం గంటల కొద్దీ ఒకే ప్రాంతంలో వేచి ఉండడంతోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్లుగా ప్రాథమికంగా అంచనా వేసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మావోయిస్టులు దండకారణ్యం పరిధిలోని బీజాపూర్‌‌ జిల్లా పువర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్నారని పోలీసు బలగాలకు సమాచారం అందింది. పువర్తి గ్రామం మావోయిస్టు బెటాలియన్‌ కమాండర్‌‌ మడావి హిడ్మా స్వగ్రామం కావడంతో అతడు ఉండి ఉంటాడనే అనుమానంతో బలగాలు ఈనెల 3న ఉదయం కూంబింగ్‌కు వెళ్లాయి.

సీఆర్పీఎఫ్‌, కోబ్రా, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. స్థానిక పరిస్థితులపై పట్టు కలిగిన డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ సిబ్బంది జవాన్లకు సహకారిగా వెళ్లారు. పువర్తి చుట్టుపక్కల ఉన్న టేకులగూడెం, జొన్నగూడెం, జీరగూడెం, ఉసంపురా.. తదితర ప్రాంతాల్లో కూంబింగ్‌ చేపట్టాయి. మావోయిస్టులు స్నానాల కోసం తరచూ టేకులగూడెం శివార్లలోని ఓ బావి వద్దకు వస్తున్నారనే సమాచారం మేరకు ఓ బృందం అక్కడికి చేరుకుంది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో సమీపంలోని గుట్టపై కూంబింగ్‌కు వెళ్లింది. అక్కడ మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకొని ఐదుగురు జవాన్లు మృతి చెందారు.

ఆ తర్వాత కొంత సేపటికే కాల్పులు నిలిచిపోవడంతో మృతదేహాలను జవాన్లు టేకులగూడెం ఊళ్లోకి తీసుకొచ్చారు. అప్పటికే 5 గంటలు గడిచిపోగా.. పరిసర ప్రాంతాల నుంచి మావోయిస్టు దళాలు అటు వైపు వస్తున్నాయంటూ బీజాపూర్‌‌ ఎస్పీ కార్యాలయం నుంచి జవాన్లను అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసులూ హెచ్చరించారు. అయితే.. సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌లోని నాగాలాండ్‌కు చెందిన అందుకు ఒప్పుకోనట్లు తెలిసింది. హెలికాప్టర్‌‌లో మృతదేహాలను తరలిద్దామనే ఉద్దేశంతో మరో గంటపాటు అక్కడే ఆగిపోయారు. ఆలోపే మావోయిస్టులు దాడిచేయడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా.. ఈ దాడిలో ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ప్రత్యక్షంగా పాల్గొనలేదని తెలుస్తోంది. ఈ మేరకు నిఘా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన బెటాలియన్‌కు మార్గనిర్దేశం చేసి ఉంటాడని భావిస్తున్నారు. అంతేతప్ప.. ఆయన దాడిలో పాల్గొనలేదనే అనుమానిస్తున్నారు.