Delhi pollution : అక్టోబర్ – నవంబర్ కాలంలో ఢిల్లీకి పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తమ పంటల వ్యర్ధాలను దహనం చేస్తుంటారు. దీనికి తోడు ఢిల్లీలో ఆ సమయంలో దట్టమైన పొగ మంచు కురుస్తుంది. ఫలితంగా గాలి నాణ్యత పూర్తిగా పడిపోతుంది. గతంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం సరి – బేసి సంఖ్యలో వాహనాలను రోడ్లపైకి అనుమతించింది. అయితే అది ఆశించినత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఈసారి వాయు కాలుష్యానికి చెక్ పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం సరికొత్తగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టిఫిషియల్ రెయిన్ లేదా కృత్రిమ వర్షాన్ని కురిపించాలని భావిస్తోంది.. నవంబర్ 1 నుంచి 15 వరకు ఢిల్లీలో కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో కృత్రిమ వర్షం కురిపిస్తామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే కృత్రిమ వర్షాలు అనుమతి ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి కి లేఖ రాసింది. 2016-2023 మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం 34.6% తగ్గిందని ఆప్ ప్రభుత్వం చెబుతోంది. గడచిన నాలుగు సంవత్సరాలలో ఢిల్లీ నగరంలో రెండు కోట్ల వరకు మొక్కలు నాటామని.. దీనివల్ల కాలుష్యాన్ని తగ్గించామని చెబుతోంది.. అంతేకాదు నవంబర్ నెలలో డ్రోన్లు ఉపయోగించి కాలుష్యం బారిన పడిన ప్రాంతాలను గుర్తిస్తామని.. వాటిని ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్ చేస్తామని వివరిస్తోంది.
ఎలా కురిపిస్తారు?
సాంకేతిక పరిభాషలో కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని పిలుస్తారు. ఈ విధానంలో వాతావరణంలో మార్పులను తీసుకొస్తారు. గాలిలో నీటి బిందువులను ఏర్పడేలా చేస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి పదార్థాలను గాల్లోకి పంపిస్తారు. ఈ ప్రక్రియను చేపట్టడానికి విమానాన్ని లేదా హెలికాప్టర్ ను ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే గాలిలో తేమ ఉండాలి. గాలి కూడా అనుకూలంగా ఉండాలి. అయితే కృత్రిమ వర్షం వల్ల గాలిలో దుమ్ము, ధూళి నియంత్రణ లోకి వస్తుంది. దుమ్ము కొట్టుకుపోయి పర్యావరణం శుభ్రం అవుతుంది. అయితే ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే వాతావరణం పూర్తిగా సహకరించాలి. నవంబర్ నెలలో ఢిల్లీలో విపరీతమైన మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రత కూడా 10 డిగ్రీలకు పడిపోతుంది. అలాంటప్పుడు కృత్రిమ వర్షం కురిపించడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కృత్రిమ వర్షం కురిపించడానికి పచ్చ జెండా ఊపొచ్చని తెలుస్తోంది. అయితే కృత్రిమ వర్షం వల్ల కాలుష్యం పూర్తిస్థాయిలో తగ్గదని.. హర్యానా, ప్రాంతాలకు చెందిన రైతులు వ్యర్ధాలను తగలబెట్టకుండా అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని.. పర్యావరణవేత్తలు అంటున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More