Bus Driver Cash Seizure: ఎంత సంపాదించిన సరే.. చనిపోయే ముందు చిల్లి గవ్వ కూడా తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే డబ్బు అనేది తాత్కాలికమైనది. ఈ తాత్కాలికమైన డబ్బు కోసం మనుషులు ఎన్నో దారుణాలకు పాల్పడుతుంటారు. ఎన్నో ఘోరాలలు చేస్తుంటారు. వాస్తవం తెలిసినప్పటికీ మనుషులు విచక్షణ అనే విషయాన్ని పూర్తిగా మర్చి పోతుంటారు. డబ్బు మాయలో పడిపోయి.. తాము మనుషులము అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతుంటారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి.. మనుషులు డబ్బు యంత్రాలుగా మారిపోయి.. చివరికి ఎటు కాకుండా పోతారు. ఈ విషయాలు తెలిసినప్పటికీ మనుషులు మారకపోవడం దారుణం.
డబ్బు మాయలో పడితే మనిషి ఎంత దిగజారి పోతాడు ఈ సంఘటన ఒక బలమైన నిదర్శనం. అతడి పేరు మినార్ మండల్. చేసేది ప్రభుత్వ బస్ డ్రైవర్. అయితే ఇటీవల అతడు రాజీనామా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది.. బిజెపి ప్రభుత్వం బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలను.. అవినీతి వ్యవహారాలను వెలుగులోకి తీసుకొస్తోంది. అవినీతి అనకొండలను జైలు పాలు చేస్తుంది. అయితే ఒక బస్సు డ్రైవర్ మీద.. అది కూడా మాజీ బస్ డ్రైవర్ మీద ప్రభుత్వ వర్గాలకు అనుమానం వచ్చింది. ఇంకేముంది అతని గురించి సమాచారం సేకరించారు. లోతుగా దర్యాప్తు చేశారు. చివరికి అధికారులకే దిమ్మ తిరిగిపోయింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మీనార్ మండల్ అనే వ్యక్తి గతంలో ప్రభుత్వ బస్ డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే అతడు అక్రమాలకు పాల్పడ్డాడని.. భారీగా సొమ్ము చేసుకున్నాడని అధికారులు గుర్తించారు. అంతేకాదు, అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అతడి ఇంట్లో ఏకంగా 20 కోట్ల నగదు లభించింది. 15 కిలోల బంగారం బిస్కెట్లు కూడా అధికారుల కంటపడ్డాయి. మండల్ బీర్ భూమి జిల్లాలో ఇసుక.. క్వారీ మాఫియాకు అండగా ఉన్నాడు. ఇక్కడ మాఫియా డాన్ తులు మండల్ కు మినార్ బంధువు అవుతాడు. మొదట్లో ఇతడు ప్రభుత్వ శాఖలో బస్ డ్రైవర్ గా పని చేశాడు. అప్పుడే అక్రమాలకు పాల్పడ్డాడు.
బస్ డ్రైవర్ గా ఉంటూనే తెరవెనుక లావాదేవీలు కొనసాగించేవాడు. ముఖ్యంగా క్వారీలు.. ఇతర వ్యవహారాలలో తన బంధువులకు అనుకూలంగా అన్ని ఉండేలాగా చూసుకునేవాడు. భారీగా సంపాదించిన తర్వాత ప్రభుత్వ బస్ డ్రైవర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత క్వారీ వ్యాపారాలు మొదలుపెట్టాడు. అయితే ఇతడు బస్సు డ్రైవర్ గా ఉన్నప్పుడు తమ బంధువుల కోసం అక్రమ మార్గంలో క్వారీలు.. ఇప్పించాడని తెలుస్తోంది. అందువల్లే పోలీసులు ఇతడి మీద దృష్టి పెట్టారు. చివరికి ఇతడి అవినీతి బాగోతాన్ని బయటపెట్టారు.