Kalvakuntla kavitha vs BJP : బీజేపీ అవసరార్థం రాజకీయం చేస్తోందా? అయినవారికి కంచంలో.. కానివారికి విస్తరాకుల్లో వడ్డిస్తోందా.? తమతో చేరితే అగ్రతాంబూలం.. లేదంటే అధ: పాతాళంలోకి తొక్కివేసే ప్లాన్ చేస్తోందా? అంటే ఔననే సమాధానం, ఆరోపణలు వస్తున్నాయి. అస్సాం కాంగ్రెస్ ను లీడ్ చేసే హిమంత బిశ్వ శర్మ ఒకప్పుడు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. బలంగా మార్చాడు. కానీ అతడి లూప్ హోల్స్ వెతికి భయపెట్టి.. బతిమాలి మరీ బీజేపీలోకి చేర్పించుకున్నారు. సీఎం సీటు ఆఫర్ చేశారు. సీబీఐ, ఈడీ కేసులు మోపారు. కానీ ఇప్పుడు బీజేపీ సీఎం అయ్యాక ఆయనపై నమోదైన కేసులు ఏవీ అతీగతీ లేకుండా పోయాయి. కనీసం దాని విషయంలో సీబీఐ, ఈడీ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈఒక్క ఉదాహరణ మాత్రమే కాదు. నాడు టీడీపీ రాజ్యసభ ఎంపీల విషయంలోనూ బీజేపీలో చేరాక వారిపై కేసులు, దాడులు ఆగిపోయాయి. ఈ లెక్కన బీజేపీలో చేరితే అందరూ పునీతులైపోతారా? అన్న ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది.
2014 నుంచి.. మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు ఫైల్ చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నాయకులు, వారి బంధువుల మీద నమోదయ్యాయి. ఇందులో 0.46% శాతం కేసులే రుజువయ్యాయి. అంటే దీనిని బట్టి తమను రాజకీయంగా కుంగ తీసేందుకు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులు ఎదుర్కొంటున్న వారు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోగానే సచ్చీలురుగా మారుతున్నారని ధ్వజమెత్తుతున్నాయి. అప్పటిదాకా దూకుడుగా వ్యవహరించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు కనిపించకుండా పోతున్నాయని ఉదహరిస్తున్నాయి.
ఇక మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 95% కేసులను ప్రతిపక్ష నాయకుల పై మోపారు. ఇందులో ట్రయల్ దశలోని కేసులు ఈ తొమ్మిది సంవత్సరాలలో ఈడి 121 మంది ప్రతిపక్ష నాయకులపై 115 కేసులు నమోదు చేసింది. తొమ్మిది సంవత్సరాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 124 కేసులు నమోదు చేసింది. ప్రతిపక్ష నాయకుల పై 118 కేసులు నమోదు చేసింది. పి ఎం ఎల్ ఏ తదితర సెక్షన్ల కింద ఈడి 5,422 కేసులు నమోదు చేసింది. ప్రతిపక్ష నాయకులపై 5,150 కేసులు నమోదు చేసింది. ఇందులో శిక్ష పడ్డవారు లేదా రుజువైన కేసులు 25 మంది మాత్రమే. ఇక 10 సంవత్సరాల యూపీఐ హయాంతో పోలిస్తే, 9 సంవత్సరాల బిజెపి హయాంలో విపక్షాలపై 27 రేట్లు ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం..
సీబీఐ, ఈడీలు కేవలం బీజేపీ ప్రత్యర్థులు, వారి మాట వినని వారిపైనే సాగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీకి అనుకూలంగా.. ప్రతి చట్టానికి మద్దతు ఇస్తున్న జగన్ విషయంలో ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయన్నది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ పై ఏకంగా లక్ష కోట్ల స్కాంల ఆరోపణలున్నాయి. 16 నెలలు జైల్లోనే ఉన్నాడు. అలాంటి జగన్ ను కేసుల్లో ఇరికించాలన్నా.. శాశ్వతంగా జైల్లో ఉంచాలన్న బీజేపీకి చిటికెలో పని. కానీ బీజేపీ ఆ పని చేయడం లేదు. ఇక జగన్ కూడా బీజేపీకి వీరవిధేయుడిగా ఉంటున్నాడు. దీంతో ఎన్నో తీవ్రమైన కేసులున్నా కూడా జగన్ పై ఈగ వాలనీయకుండా బీజేపీ కాపు కాస్తోంది.
ఇక ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులను మాత్రం బీజేపీ వేటాడుతోంది. కేజ్రీవాల్ సర్కార్ ను కూల్చేసి బీజేపీలో చేరి సీఎం కావాలని మనీష్ సిసోడియాకు బీజేపీ ఆఫర్ ఇచ్చింది. దాన్ని ఆయన తిరస్కరించి కేజ్రీవాల్ వెంట నడిచారు. ఆ తర్వాతనే లిక్కర్ స్కాం తెరపైకి వచ్చింది. కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ మోడీకి పోటీగా రెడీ కావడంతో ఆయన కూతురు కవితకు ఈ కేసు బిగించారు. నిజానికి వీళ్లు చేసింది తప్పే దాన్ని కాదనరు. కానీ ఇదే సీబీఐ ఈడీ లాంటి చట్టాలు బీజేపీ నేతలపై, వారి అనుకూలురుపై ఎందుకు ఇంత యాక్టివ్ గా పనిచేయడం లేదన్నది ప్రశ్న. కవిత విషయంలోనూ ఇంత స్పీడుగా ఎందుకు సాగుతోందన్నది బీఆర్ఎస్ నేతల ప్రశ్న.
నిజానికి కల్వకుంట్ల కవిత విషయంలోనూ అదే జరిగిందట.. ఆమెకు తండ్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. కేటీఆర్ ను సీఎం చేయాలని చూస్తున్నారని.. అందుకే బీజేపీలో చేరి లీడ్ చేయాలని బీజేపీ ఆఫర్ ఇచ్చిందట.. దీనికి కవిత ససేమిరా అనడంతోనే ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరికించారని.. టైం బ్యాడ్ అయ్యిండి ఈ కేసులోనూ కవిత ప్రమేయం బయటపడడంతో ఇరుక్కుపోయారని అంటున్నారు. ఇక్కడ కవిత తప్పు చేయలేదని అర్థం కాదు.. చేసినా.. బీజేపీకి బుక్ కావడానికి వారి ఆఫర్ ను తిరస్కరించడం కూడా ఓ కారణంగా ఉంది. ఇక రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఎత్తుగడగా కూడా చూడొచ్చు.
ఇక ఏపీ సీఎం జగన్ కేసులు సోనియా హయాంలో 2009లో నమోదయ్యాయి. 14 ఏళ్లు అయినా కూడా మోడీ సర్కార్ సీబీఐ, ఈడీ కేసులు ముందుకు సాగడం లేవు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేవలం నెలల వ్యవధిలోనే నమోదైంది. మనీష్ సిసోడియా, కవిత వంటి ప్రత్యర్థుల విషయంలో చాలా స్పీడుగా సాగుతోంది. దీన్ని బట్టి బీజేపీ హయాంలో ఈ దేశంలో రాజకీయ కక్షసాధింపులు అందరిపై ఒకేలా లేవు అని అర్థమవుతోంది. బీజేపీ వ్యతిరేకులపైనే దర్యాప్తు సంస్థలు అత్యంత కఠినగా ప్రవర్తిస్తాయని.. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు అని తేటతెల్లమవుతోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Bjp vs opposition parties bjp cases against political opponents
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com