
బాబు గారికి శుక్రుడు ఒంకర తిరిగి ఉన్నాడు. ‘మెలి తిరిగి ఉన్నా నాదే’. అనే గొప్ప సిద్ధాంతాన్ని అన్వయించుకొని ఆయన ముందుకు సాగాల్సిన అవసరాన్ని శాస్త్రం ఘోషిస్తోంది. ఈ పరిస్థితి 2024 వరకు కొనసాగుతుంది. అప్పటికిగానీ.. శుక్రుడి టింకరింగ్ పూర్తికాదు. అలా మెలితిరిగింది సక్కగైన తర్వాత ఆయన పాంచజన్యంలో మరోసారి జాతీయంగా చక్రం తిప్పగలరు. రాష్ట్రంలో బొంగరం తిప్పగలరు. అప్పటిదాకా ఉందిలే మంచీకాలం ముందు ముందూనా అనే పాట రోజుకు 24 సాగర్లు వింటే మంచి జరుగుతుందని శాస్త్రం.
పెద్దాయన తనయుడికి బృహస్పతి నెత్తిమీదున్నాడు. అందుకే ఆయన కుర్చీమీదున్నాడు. ఇదిలాగే కొనసాగుతుందని, 2024లో కుజ దోషం ఉన్నప్పటికీ.. దాన్ని తుత్తునియలు చేసే తాయెత్తును ధరిస్తే.. ఇక తిరుగుండదని ఇదే శాస్త్రం మొత్తుకుంటోంది. మధ్యలో విఘ్నాలు ఎదురొచ్చిన ప్రతిసారీ యాగాలు జరిపించి, స్వస్థతా కూటములు నిర్వహించిన అన్నీ పటా పంచెలు అగును. అందువల్ల ఎదురే లేదింకా.. అదిలించెయ్ కళ్లెం అన్న మోహన్ బాబు గారి పాటను సౌండ్ పెంచి విన్నచో.. ఉత్తేజం కలుగుతుందని శాస్త్రం.
ఇక్కడి చంద్రుడికి అమావాస్య మబ్బులు అడ్డుగా వచ్చాయి. అవన్నీ పాసింగు క్లౌడ్సే అంటూ ముందుకు వెళ్లవలసిన అవసరం ఉన్నది. బెదిరింపులన్నీయూ ఉడత ఊపులు అని.. వాటికి యాపలు కదలవు అన్న సామెంతను మదిలో ఉంచుకొని ముందుకు సాగవలెనని శాస్త్రం నొక్కి వొక్కాణించుచున్నది. అందువలన రాబోయే రోజులలో అంతా మంచియే జరుగును. మనో వాంఛలు ఫలించుట తథ్యం. ‘పుత్రోత్సాహముతో పుత్రుని కనుగొని పొగడగ..’ అనే వేమన పథ్యము రోజుకు ముమ్మారు పఠించినచో మనశ్శాంతి లభించునని శాస్త్రం.
ప్రశ్నించడానికి వచ్చిన చేగువీరన్న తమ్ముడి భవిష్యత్తు ఉజ్వలంగా కనిపించుచున్నది. రెండు చోట్లా ఓడిపోయిననూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న తీరే అందుకు బహు చక్కటి నిదర్శనం. లాయరు సాబుతోనే ప్రభంజనం షురువైనది. ఇక, ఈ ప్లవ నామ సంవత్సరం నుంచే ధిక్కార శంఖం రాష్ట్రమంతా వినిపించుతుంది. అది విన్న జనులు.. సేనాని వెంట కడలి తరంగాలై కదిలివచ్చెదరని శాస్త్రం అరచేతిలో వీడియో చూపించుచున్నది. కావున 2024లో కనీవినీ ఎరుగని ఫలితం కళ్లజూసెదరు.
మిగిలిన వారి హస్తం రేఖలు మరింత మందంగా కనిపించును.. కమలం రేకులు ఇనునప రేకులుగా మారిపోవును.. సుత్తీ కొడవలి సాన బట్టును.. అవ్విదంబుగా మీకు చెవిలో ప్లవరు నామ శుభాకాంక్షలు. కమాన్.. కమాన్.. ఇంతసేపు విన్నారుగా.. సంభావనలు గట్టిగా ముట్టజెప్పుడి. లేనిచో మీ శాస్త్రం తిప్పివేయబడునని హెచ్చరిస్తున్నది గోత్రం.