
ఏపీలోని అధికార, ప్రతిపక్షాలను లెక్కలతో కొట్టారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రతిసారి అభివృద్ధి కోణంలో జగన్ తాను ఇంత చేశానని చెబుతుంటారని.. ఇక ప్రతిపక్ష చంద్రబాబు అయితే పోలవరాన్ని కట్టింది తానేనని ప్రచారం చేసుకుంటారని.. కానీ నిజానికి ఏపీకి ఇచ్చిన నిధులన్నీ కేంద్రానివేనని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి ఇచ్చే ప్రధాన నిధులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి, పోలవరంకు నిధులు అన్నీ కేంద్రం ఇస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షలాది రూపాయలు కేంద్రం ఇచ్చిన నిధులను తీసుకొని జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందని సోము వీర్రాజు ప్రశ్నించారు.
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం నిధులేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిపై వైసీపీ, టీడీపీతో చర్చకు తాము సిద్ధం అని సోము వీర్రాజు సవాల్ చేశారు.
చంద్రబాబుపై రాళ్లదాడిని ఖండించిన సోము వీర్రాజు అదే సమయంలో అమిత్ షా వచ్చినప్పుడు టీడీపీ నేతలు రాళ్లు వేశారని.. మోడీ వస్తే నల్లబెలూన్లు ఎగురవేశారని దెప్పి పొడిచారు.
ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంది కేంద్రమేనని.. సెక్షన్ 90(4) ప్రకారం దాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని సోము వీర్రాజు తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించామని తెలిపారు. పోలవరానికి కేంద్రం 950 కోట్లు, నాబార్డు నుంచి నిధులను ఇప్పించిందని.. మొత్తం 2414.16 కోట్లు విడుదల చేశామని తెలిపారు. గత ఏడేళ్లలో పోలవరం కోసం కేంద్రం నుంచి వచ్చిన మొత్తం నిధులు రూ.8614.16 కోట్లు అని తెలిపారు.