Toxic Movie: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన కన్నడ సూపర్ స్టార్ యాష్ ‘టాక్సిక్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న కారణంగా, ఓపెనింగ్స్ అయితే భారీగానే వచ్చాయి కానీ, టాక్ ప్రభావం వల్ల రెండవ రోజు నుండి 50 శాతానికి పైగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఈ చిత్రాన్ని నిర్మాతలు సుమారుగా 600 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించామని, హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించమని ప్రమోషనల్ ఈవెంట్స్ లో చెప్పుకొచ్చారు. నిజంగా ఆ రేంజ్ బడ్జెట్ పెట్టుంటే మాత్రం, నిర్మాతలు ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. ఈ చిత్రానికి యాష్ కూడా సహనిర్మాతగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇకపోతే ఈ చిత్రం లోని సన్నివేశాలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వేస్తున్నారు. ఇలాంటి సమయం లో ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ‘టాక్సిక్’ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఒక ఆలోచనని కథగా మార్చి, స్క్రిప్ట్ తయారు చేసి, దాన్ని వెండితెర మీదకు తీసుకొని రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎన్నో వందల మంది కష్టం ఫలితం ఒక సినిమా. టాక్సిక్ చిత్రం ఒక సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాలోని కథ, పాత్రల ప్రయాణం సాధారణ కమర్షియల్ సినిమా తరహా లో ఉండదు, హాలీవుడ్ లెవెల్ లో ఉంటుంది. కథ ని చెప్పే విధానం ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. యాష్ ఈ సబ్జెక్టు ని ఎంచుకోవడం నాకు చాలా నచ్చింది. ఒక బలవంతుడిని వెండితెర పై చూపించిన విధానం ఇంకా బాగా నచ్చింది. పాత్రలో ఒదిగిపోవడానికి యాష్ పడిన కష్టం అద్భుతం. ఈ ప్రయోగం లో మా మద్దత్తు యాష్ కి ఎల్లప్పుడూ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ శెట్టి.
ఇంకా ఆయన మాట్లాడుతూ కన్నడ సినీ పరిశ్రమని యాష్ అంతర్జాతీయ లెవెల్ కి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నాడని, ఆయన చేస్తున్న ఈ కృషి అత్యంత ప్రశంసనీయం అని, ఈ సందర్భంగా హీరో యాష్ తో పాటు, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మరియు మూవీ యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ రిషబ్ శెట్టి మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఫుల్ రన్ లో 300 కోట్ల గ్రాస్ మార్కుని టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.