నటీనటులు: యష్, కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, తదితరులు
సంగీత దర్శకుడు: రవి బస్రూర్ (నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి
ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
దర్శకత్వం: గీతు మోహన్ దాస్
నిర్మాణం: కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్
కే.జీ.ఎఫ్ 1 & 2 సినిమాలు భారీ స్థాయిలో విజయం సాధించడంతో యష్ ఒక్కసారిగా కన్నడ హీరో నుంచి ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దీంతో సహజంగానే రాకింగ్ స్టార్ యష్ తన నెక్స్ట్ సినిమాకు ఎలాంటి కథను ఎంచుకుంటాడు, డైరెక్టర్ ఎవరు అని ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసినప్పుడు ప్రాజెక్టుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ టీజర్ లో గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యం, ప్రోమో మెటీరీయల్ బోల్డ్ గా ఉండడంతో సినిమా బాగుంటుందేమో అని కొందరిలో ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టాక్సిక్ ఆడియన్స్ ను అలరించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
ఇదో పీరియడ్ బ్యాక్ డ్రాప్ కథ. 1940 నుంచి 1970ల మధ్య కాలంలో ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి క్రైమ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎదిగిన రాయా(యష్) జీవితంలో జరిగే సంఘటనల సమాహారమే ఈ టాక్సిక్. అతని జీవితంలో మరో ముఖ్య పాత్ర పోషించే మనిషి తన సోదరి గంగ(నయనతార). చిన్నతనంలో అనాధలు గా మారినప్పుడు రాయాను ఒక తల్లి లాగా కాపాడుకుంటుంది. రాయా క్రైమ్ సిండికేట్ ను ఏలే సమయంలో తనకు ఒక రైట్ హ్యాండ్ లాగా తోడుగా ఉంటుంది. క్రైమ్ సిండికేట్ లో కీలకస్థానంలో ఉన్న సాల్వడార్ కూతురు రెబెకా(తారా సుతారియా)ను రాయాపెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు సర్కస్ లో పనిచేసే నాడియా (కియారా అద్వానీ) తో రాయా రిలేషన్ కొనసాగిస్తూనే ఉంటాడు. ఒక కొడుకును కంటాడు. కొంతకాలం తర్వాత నాడియాకు దూరం అవుతాడు. కథలో పెద్ద ట్విస్ట్ ఎప్పుడంటే రాయా తన కొడుకు టికెట్ (యష్) ను కలవడమే. వీరిద్దరి మధ్యలో ఏం జరిగింది? గంగకు ఏమైంది. ఎలిజబెత్(హుమా ఖురేషీ) ఎవరు? ఈ పాత్రల మధ్య సాగిన డ్రామా, యాక్షన్ లాంటి అంశాలే ఈ సినిమాలో మిగతా స్టోరీ.
దర్శకురాలు గీతు మోహన్ దాస్ ఈ సినిమాను ఒక బోల్డ్ అండ్ డార్క్ థీమ్ లో ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేశారు కానీ కథ, స్క్రీన్ ప్లేల విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టలేదని క్లియర్ గా కన్పిస్తుంది. ఎప్పుడో 80 ఏళ్ల క్రితం జరిగే కథ, లెక్కలేనన్ని పాత్రలు..కొన్ని నోరు తిరగని పాత్రల పేర్లు.. ఎవరు ఏం చేస్తారో తెలిసేలోపు కొత్త ఎపిసోడ్ రావడం.. ఇలా కథను తికమకగా ప్రెజెంట్ చేసి, ఆ కథకు మిగతా హంగులు జోడించింది. దీంతో మనమేం ఏం చూస్తున్నామో, ఎందుకు చూస్తున్నామో తెలియక, సినిమా బాగుందో – బాగలేదో అర్థం కాక బుర్ర గోక్కుంటాం. బోల్డ్ గా ఉండే రెండు మూడు సీన్లు కాస్త హై ఇస్తాయేమో కానీ.. అసలు వయొలెన్స్ ఎందుకు వస్తుందో ఒక లాజిక్ కూడా ఉండదు. ఎంత అండర్ వరల్డ్ సినిమా అయినా వాళ్ళు 24 గంటలూ కాల్చుకుంటూనే ఉండరు. ఆఖరికి మటన్ కొట్టు మస్తాన్ కూడా రాత్రి పూట ఖైమా కొట్టడం మానేసి, షాప్ కట్టేసి ఇంటికి పోయి పడుకుంటాడు. ఆ లాజిక్ ను గీత మోహన్ దాస్ మరచిపోవడం ఈ సినిమా చూసే ప్రేక్షకుల ప్రాణానికి వచ్చింది. స్టైలిష్ మేకింగ్ ఉంది కానీ యాక్షన్ ఎపిసోడ్స్ ఓవర్ డోస్ కావడంతో ఒక దశ దాటేసరికి బ్రమ్మి సార్ లాగా ‘మీ అమ్మ కడుపులు కాల.. ఇక చాలు ఆపండ్రోయ్’ అని ఘట్టిగా అరవాలని అనిపిస్తుంది కానీ రవి బస్రూర్ బాదుడు ముందు మీ గొంతు ఎవరికీ వినిపించదని ఊరుకోవాల్సి వస్తుంది. సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ లేదు. కెజీఎఫ్ ను రిఫరెన్స్ గా పెట్టుకుని కొన్ని ఎపిసోడ్స్ రాసుకున్న విషయం కూడా తెలిసిపోతుంది. ఇక యష్ అయితే కేజీఎఫ్ హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేదని కూడా అర్థం అవుతుంది.
ఈ సినిమాలో రైటింగ్ వీక్. నాలుగైదు డైలాగులు.. అవీ కేజీఎఫ్ ఫ్లేవర్ లోనే ఉన్నాయి. అవి తప్ప మిగతా అంతా సోది. స్టోరీ ఎలాగైనా ఉండొచ్చు కానీ స్క్రీన్ ప్లే విషయంలో పూర్తిగా తడబడ్డారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, రవి బస్రూర్ సంగీతం కొన్ని చోట్ల బాగుంది కానీ యాక్షన్ ఓవర్ డోస్ వల్ల అదీ పెద్దగా ఇంపాక్ట్ ఉన్నట్టు అనిపించదు. ఇక ఈ సినిమాను మరో అర్థగంట, ముప్పావు గంట ట్రిమ్ చేసినా పెద్దగా నష్టం లేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం తెరపై కనిపిస్తుంది, ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
నటీనటుల విషయననికి వస్తే రాయా గా యష్ కెజీఎఫ్ రాకీ స్టైల్ లోనే కనిపించాడు. కానీ టికెట్ పాత్రలో యష్ నటన కొత్తగా ఫ్రెష్ గా ఉంది. నయనతార, కియారా అద్వాని, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణీ వసంత్ అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అందరిలో కియారా నటన కొంచెం ఎక్కువగా ఆకట్టుకుంటుంది.
సినిమాలో ఏం బాగున్నాయో తెలుసా?
1. సినిమాటోగ్రఫీ
2. ఆర్ట్ డిపార్ట్ మెంట్ వర్క్
సినిమాలో బాగలేనివి ఇవి:
1. అవకతవక, తికమక స్క్రీన్‌ప్లే
2. బలమైన ఎమోషనల్ కనెక్ట్ లోపించడం
3. 3.14 నిముషాల రన్ టైమ్
రేటింగ్: 1.5/5
ఫైనల్ వర్డ్: డ్రంక్ & డ్రైవ్ నిందితులకు శిక్షగా సూచిస్తే బెటర్