Ghani: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, పోస్టర్లు అభిమానులకు అచనాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు తమన్ నేపథ్య సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు, ఈ చిత్రాన్ని డిసెంబరు 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
తాజాగా, సునీల్ శెట్టి, ఉపేంద్ర పాత్రలను పరిచయం చేస్తూ.. ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. వీరిద్దరూ విక్రమాదిత్య, విజయేంద్ర సిన్హా పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచె చిత్రంతో రెండో సినిమాకే తనలోని నటుడికి ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వరుణ్. ఆ తర్వాత వచ్చిన లోఫర్, ఫిదా, గద్దలకొండ గణేశ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించాయి. వెంకీ మామతో కలిసి ఎఫ్ 2 సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు వరుణ్. ఇప్పుడు బాక్సింగ్ ఛాంపియన్‌గా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా తెలియాలంటే.. విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.