Pooja Hegde: సినీ తారల జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు ఉన్న స్టార్ స్టేటస్ రేపు ఉండదు. ఒకే ఒక్క ఫ్లాప్ చాలు పాతాళ లోకంలోకి పడిపోవడానికి. మళ్లీ పైకి లేచే అవకాశం కూడా లేకుండా ఎంతో మంది ఇండస్ట్రీ నుండి కనుమరుగు అయిపోయారు. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కెరీర్ ఎప్పుడూ సక్సెస్ ట్రాక్ లోనే ఉండాలి. పొరపాటున ఆ ట్రాక్ తప్పిందంటే కెరీర్ పోయినట్టే. హీరోలు అయిన నాలుగైదు ఫ్లాప్స్ ని తట్టుకోగలరు. కానీ హీరోయిన్స్ మాత్రం తట్టుకోలేరు. వరుసగా రెండు మూడు ఫ్లాప్స్ వస్తే పక్కకి నెట్టేస్తారు. ప్రస్తుతం పూజ హెగ్డే(Pooja Hegde) పరిస్థితి కూడా అదే పాపం. మూడేళ్ళ క్రితం వరకు పూజ హెగ్డే హవా టాలీవుడ్ లో మామూలుగా కొనసాగలేదు. దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం పడిగాపులు కాచేవారు.
హీరోలు కూడా పూజ హెగ్డే తో కలిసి నటించడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉండేవాళ్ళు. ఒక్క పవన్ కళ్యాణ్ తో తప్ప, ఈ జనరేషన్ సూపర్ స్టార్స్ అందరితో ఈమె సినిమాలు చేసేసింది. అయితే ఈ హాట్ బ్యూటీ కి ‘రాధే శ్యామ్’ నుండి బ్యాడ్ టైం మొదలైంది. ప్రభాస్ హీరో గా నటించిన ఆ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా చేసిన బీస్ట్, ఆచార్య చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా ఆమె బాలీవుడ్ లో చేసిన దేవా, సర్కస్, కిసీ కా భాయ్..కిసీ కా జాన్ వంటి చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ గత ఏడాది విడుదలైన రెట్రో మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన ‘జన నాయగన్’ చిత్రం రెడీ అయ్యింది.
కానీ ఈ సినిమాకు వచ్చిన కష్టాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలా పూజ హెగ్డే కి ప్రస్తుతం బ్యాడ్ టైం మామూలుగా నడవడం లేదు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు, ప్రస్తుత తన కెరీర్ ని తల్చుకొని బాధపడుతున్నట్టుగా అనిపించింది. ఆమె మాట్లాడుతూ ‘ఈమధ్య కాలం లో నా టైం అసలు బాగాలేదు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. కొన్నాళ్లుగా నా జీవితం నుండి విజయం అనే పదం దూరం అయిపోయింది. ఇది నాకు చాలా ముఖ్యమైన సమయం. ఇక నుండి నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చూపిస్తాయి. సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి రానటువంటి నాలాంటి ఎంతో మంది అమ్మాయిలు, ఎన్నో సవాళ్ళను ఎదురుకోవాల్సి వస్తుంది. అందుకు నేను రెడీ. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది పూజ హెగ్డే.