Tirupati Cheating Woman: కష్టపడకూడదు. చెమట చిందించకూడదు. ఒళ్ళును వంచకూడదు. డబ్బులు మాత్రం రావాలి. విలాసాలు అనుభవించాలి. సౌకర్యాలు సొంతం చేసుకోవాలి. భోగభాగ్యాలను ఆస్వాదించాలి. ఇవన్నీ జరగాలంటే ఎదుటివారిని మోసం చేయాలి. అలా మోసం చేయడంలో ఈమె పీహెచ్డీ చేసింది. మామూలుగా అయితే ఆర్థిక నేరాలకు పాల్పడేవారు రకరకాల భ్రమలు కల్పిస్తుంటారు. అనేక విధాలుగా మాయమాటలు చెబుతారు. జనాలను నిండా ముంచిన తర్వాత డబ్బులతో ఎస్కేప్ అవుతారు. తమకు ఉన్న రాజకీయ పలుకుబడితో కేసుల నుంచి తప్పించుకుంటారు. అలాంటి వ్యవహారమే ఈమెది కూడా.
ఆమె పేరు విద్య. స్వస్థలం తిరుపతి. పుట్టింది పేద కుటుంబం అయినప్పటికీ.. విలాసాలు అనుభవించాలని కోరుకునేది. సౌలభ్యాలు సొంతం చేసుకోవాలని భావించేది. లగ్జరీ లైఫ్ ఆస్వాదించాలని భావించేది. అందువల్లే మోసాలకు తెర లేపింది. తినడానికి తిండి లేకున్నా.. కార్లలో తిరిగేది. కట్టిన చీర కట్టకుండా కట్టేది. వైవాహిక జీవితం గురించి తెలియదు గాని.. ఊరంతా తనను తాను గొప్పగా ప్రచారం చేసుకునేది. చుట్టుపక్కల వారితో వ్యాపారం చేస్తున్నట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది. సెక్యూరిటీతో హంగామా చేసేది. అలా చుట్టుపక్కల ఉన్న మహిళల దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఎస్కేప్ అయింది. తన మకాం హైదరాబాద్ కు మార్చింది.
హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఉన్న మహిళలతో పరిచయాలు పెంచుకొని డబ్బులు వసూలు చేసింది. కొంతమంది దగ్గర బంగారం కూడా తీసుకుంది. లక్ష తీసుకుంటే అదనంగా మరో లక్ష ఇస్తానని.. దానికి తోడు బంగారం కూడా బహుమతిగా ఇస్తానని చెప్పింది. రెట్టింపు వస్తుండడం.. దానికి తోడు బంగారం కూడా ఇస్తూ ఉండడంతో చాలామంది మహిళలు ఆమెకు డబ్బులు ఇచ్చారు. ఇలా ఏకంగా 18 కోట్ల దాకా వసూలు చేసింది. మొదట్లో డబ్బులు ఇచ్చిన వారికి సక్రమంగానే చెల్లించింది. దీంతో అందరూ ఆమె మీద నమ్మకం పెంచుకున్నారు. కాని చివరికి ఆమె అసలు రూపం తెలియడంతో నోర్లు వెళ్ళబెట్టారు..
విద్య వ్యవహారం వెలుగులోకి రావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో డబ్బులు ఇచ్చిన వారికి సక్రమంగానే చెల్లించిన విద్య.. ఆ తర్వాత తన విద్యను ప్రదర్శించడం మొదలుపెట్టింది. అప్పులు ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టడం.. బెదిరింపులకు గురి చేయడం.. రౌడీలతో కొట్టించడం వంటి పనులు చేసింది. దీంతో ఆమెకు భయపడి చాలామంది డబ్బులు అడగడం మానేశారు. అయితే కొంతమంది ధైర్యం చేసి ఆమె ఆగడాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉంది. ఆమె వసూలు చేసిన డబ్బు ఏం చేసింది? ఎక్కడ పెట్టుబడులు పెట్టింది? ఆమె వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు? అనేక కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్య స్వస్థలం తిరుపతి కాదని.. ఆమె పట్టుమని పది నెలలు కూడా ఎక్కడా ఉండదని పోలీసుల దర్యాప్తులో తేలింది.