Bira 91: ఓ సినిమాలో అల్లు అర్జున్ అంటాడు కదా.. తన పేరే ఒక బ్రాండ్ అని.. నిజానికి ఆ డైలాగ్ చాలామందికి సినిమాటిక్ మాదిరిగానే అనిపించి ఉండవచ్చు. కానీ పేరు అనేది మనిషికే కాదు, ఎంతటి పెద్ద తోపు సంస్థ కైనా సరే అదే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వల్లే వ్యాపారం సవ్యంగా సాగుతుంది. వేల కోట్లు దక్కేలా చేస్తుంది. మనదేశంలో బ్రాండ్ వ్యాల్యూను కాపాడుకుంటూ.. పేరును సరికొత్తగా ఆధునికీకరిస్తూ అనేక కంపెనీలు వినియోగదారుల మనసు చూరగొనే ప్రయత్నం చేస్తున్నాయి. తమ వ్యాపారాన్ని అంతకంతకు విస్తరించుకునేలా చేస్తున్నాయి.
అప్పట్లో ప్రఖ్యాత టెలికాం కంపెనీ ఎయిర్టెల్ లోగో ఒక విధంగా ఉండేది. అది జనాల్లోకి విస్తృతంగా దూసుకుపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఎయిర్టెల్ తన లోగోను మార్చింది. అలాగని రాత్రికి రాత్రి ఈ నిర్ణయం తీసుకోకుండా ప్రాంతాలవారీగా మార్చుకుంటూ వెళ్ళింది. తద్వారా తన యూజర్లకు సరికొత్త విధానాన్ని పరిచయం చేసింది. ఈ కొత్త విధానం ద్వారా తన మార్కెటింగ్ ప్రమోషన్ ను విభిన్నంగా చేసిన ఎయిర్టెల్.. అంతటి జియో దూకుడును సైతం తట్టుకుంది. ఇదే జాబితాలో టిసిఎస్, మారుతి, మహీంద్రా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు ఉన్నాయి. కాకపోతే ఈ సంస్థలు తమ పేరును మార్చుకున్నప్పటికీ.. వినియోగదారులలో నమ్మకాన్ని కోల్పోలేదు. అందువల్లే మరింత పై స్థాయికి ఎదిగాయి.
పేరులో మార్పు మంచిదే అయినప్పటికీ.. ఓ కంపెనీని మాత్రం ఆ పేరు దెబ్బకొట్టింది. మార్చాలని తీసుకున్న నిర్ణయం కొంపముంచింది. ఢిల్లీకి చెందిన బీ9 బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మంచి చరిత్ర ఉంది. ఈ కంపెనీ Bira91 పేరుతో బీర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ బీర్లకు నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజీ ఉంటుంది. పైగా ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ ఈ కంపెనీ స్థాయిని అందుకోలేకపోయాయి. కొన్ని కంపెనీలు పోటీ పడినప్పటికీ చివరికి తోక ముడిచాయి. బి9 బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2024 లో ఐపీఓ కోసం పివిటి అనే పదాన్ని తొలగించింది. దీంతో కొత్త పేరుతో బీర్లను మార్కెట్లోకి తీసుకురావాల్సి వచ్చింది. అదే కంపెనీ వేరే పేరుతో బీర్లను ఉత్పత్తి చేయడంతో మార్కెట్ విలువ పడిపోయింది.. ఎన్ని రకాలుగా ప్రమోట్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీనికి తోడు చాలా రాష్ట్రాలలో ఈ బీర్లను నిషేధించారు. ఉత్పత్తి నిలిచిపోయింది. 748 కోట్ల నష్టం వాటిల్లింది. చివరికి సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సిబ్బంది కంపెనీకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. సీఈఓ జైన్ ను అప్పగించాలని పిటిషన్ వేశారు. ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది.. తుది తీర్పు ఎలా వచ్చినప్పటికీ ఇప్పట్లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
ఒకప్పుడు అద్భుతమైన జీతాలు, బోనసులు, నిండా ఉద్యోగులతో సందడిగా ఉన్న ఆ సంస్థ పేరు మార్పు వల్ల తన ప్రాభవాన్ని కోల్పోయింది. తన ప్రస్థానాన్ని నష్టపోయింది. చివరికి ఇదిగో ఇలా మూతపడింది. వాస్తవానికి ఒక పేరు అనేది ఒక సంస్థకు ఎంతో విలువైనది. ఆ పేరును కాపాడుకుంటూనే.. కొత్త పేరు కోసం తాపత్రయపడాలి. అలా కాకుండా ఉన్న పేరుని తొలగించుకుంటే ఇదిగో ఇలానే కష్టాలు పడాల్సి ఉంటుంది.