Oppo F35 Series : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒప్పో ఎఫ్ సిరీస్ భారత్‌లో పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు ఈ సిరీస్‌ను 3 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉపయోగిస్తున్నట్లు ఒప్పో వెల్లడించింది. గతంలో సెల్ఫీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ సిరీస్.. ఇప్పుడు గ్రూప్ ఫొటోగ్రఫీ, కంటెంట్ క్రియేషన్, మెరుగైన పనితీరుపై దృష్టి సారిస్తోంది.
2016లో ప్రారంభమైన ఎఫ్ సిరీస్‌లో ఎఫ్1, ఎఫ్3, ఎఫ్5, ఎఫ్7 వంటి మోడళ్లు సెల్ఫీ కెమెరాల ప్రత్యేకతతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. కాలక్రమేణా బ్యాటరీ సామర్థ్యం, పనితీరు, ఫోన్ మన్నిక వంటి అంశాలకు కూడా కంపెనీ ప్రాధాన్యం ఇచ్చింది. తాజాగా విడుదలైన ఎఫ్35 సిరీస్‌తో కెమెరా ఫీచర్లను మరో స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఒప్పో ఇండియా కమ్యూనికేషన్స్ హెడ్ గోల్డీ పట్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎఫ్35 సిరీస్‌లో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా, 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఒకే ఫ్రేమ్‌లో ఎక్కువ మంది కనిపించేలా ఈ కెమెరాను రూపొందించారు. అలాగే నేచురల్ టోన్ 2.0, ఏఐ ఆధారిత ఎడిటింగ్ ఫీచర్లు ఫొటోలను మరింత సహజంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడతాయి.
కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించేందుకు కూడా ఒప్పో ప్రయత్నిస్తోంది. వీడియోల చిత్రీకరణ, ఎడిటింగ్, సోషల్ మీడియాలో షేరింగ్ వంటి పనులకు అనుకూలంగా కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఎఫ్35 ప్రో మోడల్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ముందు వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ సదుపాయం ఉన్నాయి.
బ్యాటరీ విషయంలోనూ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు కలర్‌ఓఎస్ 16ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 500కు పైగా పట్టణాల్లో 600కు మించిన సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
స్మార్ట్‌ఫోన్ల వినియోగ కాలం పెరుగుతున్న నేపథ్యంలో కెమెరా, బ్యాటరీ, పనితీరు, సేవలను సమన్వయం చేస్తూ ఎఫ్ సిరీస్‌ను మరింత విస్తృత వినియోగదారులకు చేరువ చేయాలని ఒప్పో భావిస్తోంది.