YS Jagan Padayatra: జనంలోకి వస్తానని జగన్ ( Y S Jagan Mohan Reddy )పదేపదే చెబుతున్నారు. గత రెండు సంక్రాంతులు ఇదే మాట చెప్పుకొచ్చారు. కానీ జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు. పోనీ పాదయాత్ర సన్నాహాలైన మొదలుపెట్టారు అంటే అది లేదు. కానీ ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి తాను ఒకసారి ప్రజల్లోకి వస్తే ఇక కూటమికి కౌంట్ డౌన్ అని తేల్చి చెబుతున్నారు. నిన్ననే ఒక పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. మున్ముందు చంద్రబాబుకు సినిమా చూపిస్తానంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటికే రెండేళ్లు అయిపోయింది.. మరో మూడేళ్లు ఇట్టే జరిగిపోతుంది. రెడ్ బుక్ కు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ రొటీన్ డైలాగులు చెప్పారు. ఉత్సాహంగా పనిచేయాలని చెప్పుకొచ్చారు. తాను మాత్రం ఏడాదిన్నర తరువాత జనంలోకి వస్తానని పాదయాత్ర విషయంలో క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ గ్యాప్ లో ప్రజా పోరాటాల విషయంలో మాత్రం ఏ విషయం చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి.
ఏడాదిన్నర కాలం తర్వాత..
2027 ద్వితీయార్థంలో పాదయాత్ర మొదలు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంతలో పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో వారం రోజుల పాటు పర్యటన ఉంటుందని గత రెండు సంవత్సరాలుగా చెబుతూ వచ్చారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోను ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ప్రతిచోట క్రియాశీలకమైన నాయకుడితో మాట్లాడి పార్టీ పరిస్థితిని తెలుసుకుంటానని చెబుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ మాట చెప్పడమే కానీ చేసిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి.
పాదయాత్రకు పక్కా వ్యూహం..
అయితే ఈసారి పాదయాత్రను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. దాదాపు 5 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని చూస్తున్నారు. అయితే అది ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి కూడా. అయితే మధ్యలో ప్రజలతో సంబంధాలు లేకుండా.. ప్రజా పోరాటాలు చేయకుండా ప్రజలను ఎలా కలుస్తారు అన్నది ప్రశ్న. ఎందుకంటే 2017లో పాదయాత్ర చేశారు. అప్పుడు ఆయన ఫ్రెష్ లుక్ తో కనిపించారు. కానీ ఈసారి అలా కాదు కూడా. ఆయన ఐదేళ్లపాటు పాలించారు. ఆ పాలన నచ్చక ప్రజలు ఘోరంగా ఓడించారు. గత మాదిరిగా ప్రజల్లోకి నేరుగా వెళ్లిపోతామంటే కుదరదు కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి వీలైనంతవరకు ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రజా పోరాటాలతో చేరువ అవుతుంది. కానీ సాటి స్నేహ పార్టీ చేస్తున్న పని కూడా జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం అనేది వైసిపికి లోటు.
రెండు సంక్రాంతులు దాటిపోయాయి..
2024 లో ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి. 2025 సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తానన్నారు. అది కూడా జరగలేదు. 2026 సంక్రాంతి తర్వాత అన్నారు. దానికి కూడా అతిగతి లేదు. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత వచ్చి సినిమా చూపిస్తానని చెబుతున్నారు. అయితే అది ఎలాంటి సినిమా ఆయనకే తెలియాలి. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు ఒక్కడే. ఇప్పుడు మాత్రం ఆయనకు అండగా పవన్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది. ఇటువంటి సమయంలో సినిమా చూపిస్తాను అనే మాట కాస్త అతిశయోక్తిగానే ఉంది.