Three Chief Ministers Meeting: దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఆ పార్టీ నేరుగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తమిళనాడులో ప్రభుత్వ భాగస్వామిగా ఉంది. అయితే ఏపీలో మాత్రం టిడిపి కూటమి ప్రభుత్వం ఉంది. ఒకరకంగా ఎన్డీఏ ప్రభుత్వం అనుకోవాలి. అయినా సరే ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రిలతో మంచి సంబంధాలే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు ఒకే వేదికపై వస్తున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యకరం. ఓ అధికారిక కార్యక్రమంలో భాగంగా ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై వస్తుండడంతో అందరి దృష్టి అటువైపే ఉంది.
గత ఏడాది కొట్టుకుపోయిన గేట్లు..
గత ఏడాది ఆగస్టులో తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు కొట్టుకుపోయాయి. ఆ సమయంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సంబంధిత నిపుణులతో కలిసి తాత్కాలిక గేట్లు ఏర్పాటు చేసి వరద నీటిని అడ్డుకున్నారు. అయితే ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో 120 రోజుల్లోనే 33 నూతన క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఈరోజు ఆ గేట్లను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ ఈ గేట్లను ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నిన్ననే కర్నూలు చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో కర్ణాటకలోని కొప్పల జిల్లాలో ఎయిర్పోర్ట్ కు చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రాజెక్టు దగ్గరకు వెళ్తారు. హైదరాబాదు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో వచ్చి.. రోడ్డు మార్గంలో తుంగభద్ర ప్రాజెక్టుకు చేరుకుంటారు. కేంద్ర మంత్రి పాటిల్, కర్ణాటక సీఎం బి కే శివకుమార్ సైతం ఆ సమయానికి చేరుకుంటారు. కేంద్ర మంత్రులతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు 33 గేట్లను ప్రారంభిస్తారు. అనంతరం మునీరాబాద్ సమీపంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
భిన్నమైన ప్రభుత్వాలు..
కర్ణాటక తోపాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు విషయంలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు గౌరవభావంతోనే ఉంటున్నారు. అయితే ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదిక పైకి వస్తుండడంతో.. ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా కేంద్ర జల శక్తి మంత్రి హాజరవుతుండడంతో సరిహద్దు జలాల వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఒక సహృద్భావ వాతావరణం నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలయిక ఒక సంచలనం అయితే.. కర్ణాటక సీఎం వీరిని జతకలుస్తుండడం మరింత ప్రాధాన్యంగా మారింది.
