Digital Payments India: భారతదేశంలో ప్రస్తుతం నగదు వ్యవహారాలకంటే డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా మారాయి. కిరాణం షాపు నుంచి పెద్ద పెద్ద చెల్లింపులు ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. అయితే డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, నగదు వినియోగం మాత్రం తగ్గడం లేదని కొన్ని నివేదికలను బట్టి తెలుస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గణాంకాల ప్రకారం.. గత పదేళ్లలో చలామణిలో ఉన్న నగదు విలువ దాదాపు మూడు రెట్లు పెరిగింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో నగదుకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితె..
RBI లెక్కల ప్రకారం 2017 ఆర్థిక సంవత్సరంలో దేశంలో చలామణిలో ఉన్న నగదు విలువ సుమారు రూ. 13 లక్షల కోట్లు. అయితే 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ. 41 లక్షల కోట్లకు చేరింది. యూపీఐ, మొబైల్ వాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ నగదు అవసరం తగ్గకపోవడం విశేషం.
తగ్గుతున్న ఏటీఎంలు
ఒకవైపు నగదు చలామణి పెరుగుతుండగా.. మరోవైపు ATM నెట్‌వర్క్ క్రమంగా తగ్గుతోంది. 2023లో దేశవ్యాప్తంగా 2.19 లక్షలకు పైగా ATMలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 2.09 లక్షలకు పడిపోయింది. బ్యాంకులు నిర్వహణ ఖర్చులు తగ్గించడం, డిజిటల్ లావాదేవీలపై ఎక్కువ దృష్టి పెట్టడం వంటి కారణాలు దీనికి ప్రధానంగా చెప్పబడుతున్నాయి. ఇదే సమయంలో ATMల ద్వారా నగదు ఉపసంహరణలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. 2023లో ATMల నుంచి సుమారు ₹32.6 లక్షల కోట్ల నగదు ఉపసంహరించగా, ప్రస్తుతం అది ₹28.6 లక్షల కోట్లకు తగ్గింది. అంటే ప్రజలు నగదును పూర్తిగా వదిలేయకపోయినా, అవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటూ రోజువారీ లావాదేవీలకు డిజిటల్ పద్ధతులను ఎక్కువగా వినియోగిస్తున్నారని అర్థమవుతోంది.
యూపీఐ విప్లవం భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పును తీసుకొచ్చింది. చిన్న టీ దుకాణం నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు QR కోడ్ చెల్లింపులు సాధారణమయ్యాయి. దీంతో చిన్న మొత్తాల కోసం ATMలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయింది. ఫలితంగా ATMల వినియోగం తగ్గినా, అత్యవసర పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపార లావాదేవీల కోసం నగదు డిమాండ్ మాత్రం కొనసాగుతోంది.
