Chandrababu Rayalaseema: రాయలసీమ సరికొత్త దిశగా ఆవిష్కృతం అవుతోంది. తయారీ రంగ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. పుట్టపర్తిలో రక్షణ శాఖకు సంబంధించి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు నిర్మితం కానుంది. దేశంలోనే తొలి పరిశ్రమగా ఇది ఏర్పాటు కానుంది. వేలకోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ ఏర్పాటు అవుతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఏర్పాటు కానున్న పరిశ్రమలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు. నిజంగా ఇది రాయలసీమకు శుభపరిణామమే.
* తయారీ రంగ పరిశ్రమలు..
తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రను ఐటి హబ్ గా మార్చాలని చూస్తోంది. కోస్తాంధ్రకు సంబంధించి అమరావతి రాజధానిలో సైతం భారీగా పెట్టుబడులు పెట్టేలా రూపకల్పన చేస్తోంది. రాయలసీమకు సంబంధించి తయారీ రంగ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించింది. ఇప్పటికే తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. కర్నూలులో డ్రోన్ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రాయలసీమ జిల్లాలు అటు చెన్నైకు, ఇటు బెంగళూరుకు దగ్గరగా ఉండడంతో కలిసి వచ్చే అంశం. తయారీ రంగ పరిశ్రమలు రావడంతో అనుబంద పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.
* అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం..
రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో వెళ్తోంది. మూడు ప్రాంతాలు సమాన అభివృద్ధి కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. విశాఖను ఐటి హబ్ గా మార్చాలని చూస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. మరోవైపు విజయనగరం జిల్లాలో లక్ష కోట్ల పెట్టుబడితో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్రవ్యాప్తంగా అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. అనకాపల్లి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు వడివడిగా సాగుతోంది. అయితే మధ్యలో కోస్తాంధ్రలో సైతం వీలైనంత పరిశ్రమల ఏర్పాటు జరుగుతోంది. అయితే రాయలసీమ విషయంలో మాత్రం తయారీ రంగ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అక్కడ భూముల సేకరణతో పాటు ఆయా కంపెనీలకు ప్రోత్సాహకాలు, భూ సమీకరణ సులువుగా జరుగుతుండడంతో పరిశ్రమల ఏర్పాటుకు ఎటువంటి అడ్డంకులు ఉండడం లేదు. భవిష్యత్తులో సైతం మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
