Andhra Pradesh Fishermen : పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. పది రోజుల కిందట సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ తెలిసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం వాడలరేవు జెట్టీ నుంచి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు వెనక్కి రాలేదు. దీంతో వారు గల్లంతయ్యారని అంతా భావించారు. ఈనెల 17 నుంచి వారి ఆచూకీ కోసం గాలించారు. చివరకు పశ్చిమ బెంగాల్ తీరంలో వారి ఆచూకీ దొరికింది. వీరంతా కోల్కత్తా సమీపంలో బుధవారం మధ్యాహ్నం సముద్ర తీరానికి చేరుకున్నారు. ఈ విషయంపై ఏపీ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ ఏడుగురిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
* ఈ నెల 3న వేటకు..
ఈనెల 3న వాడల రేవు తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. పది రోజులు అవుతున్నా వారు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈనెల 17 నుంచి నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మిగతా మత్స్యకారులను సైతం అప్రమత్తం చేశారు. ఇంతలో పశ్చిమ బెంగాల్ హార్బర్ సమీపంలో వారి బోటును గుర్తించారు. అందులో మత్స్యకారులను క్షేమంగా ఉన్నట్లు గుర్తించగలిగారు. మత్స్యకారుల ఆచూకీ దొరకడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన బృందాలతో పాటు అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.
* తీరంలో అలజడితో..
వాస్తవానికి గత కొద్ది రోజులుగా అల్పపీడన ప్రభావంతో తీరంలో అలజడి నెలకొంది. మత్స్యకారులు తీరానికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల మూడున చేపల వేటకు బయలుదేరిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో వారు గల్లంతయ్యారని అంతా భావించారు. కానీ వారు వెళ్లిన బోటులో గేరు బాక్స్ దెబ్బతింది. దీంతో 20 రోజులకు పైగా వారు సముద్రంలోనే ఉండి పోవాల్సి వచ్చింది. ఇంతలో మరో బోటు కనిపించడంతో ఫోన్ నుంచి మత్స్యకారులు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఇంతలో ఆ బోటు బాగుచేసి పశ్చిమ బెంగాల్ తీరంలోని జిగా ప్రాంతానికి చేరుకున్నారు. మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నారని తెలియడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
మత్స్యకార సోదరులందరూ సురక్షితం!
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం నుంచి వేటకు వెళ్లిన మన మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా ఉన్నారు.
ముందస్తు జాగ్రత్తగా వారికి వైద్య పరీక్షలు అందిస్తున్నాం. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. త్వరితగతిన వారిని… pic.twitter.com/Zzc80XzG7k— Kinjarapu Atchannaidu (@katchannaidu) August 26, 2026