AP Constituency Delimitation 2029: నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం అవుతోంది. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు సంబంధించి బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపాదించనుంది కేంద్రం. ఇదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సైతం అమలు చేయనున్నారు. 2029 ఎన్నికల నాటికి ప్రక్రియ అమలు చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఈ లెక్కన ఏపీలో పెరగబోయే పార్లమెంట్ సీట్ల విషయంలో ఒక క్లారిటీ వస్తోంది. గతంలో ఉన్నవి కొన్ని పునరుద్ధరించడంతో పాటు ఉన్న వాటిలో మరికొన్ని రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే పునర్విభజనతో ఏపీలో లోక్సభ నియోజకవర్గాల ముఖచిత్రం మారనుంది.
* 13 ఎంపీ స్థానాలు అదనం..
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ఏపీలో లోక్సభ స్థానాలు మరో 13 అదనంగా పెరగనున్నాయి. అదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు నేపథ్యంలో ఏపీ నుంచి మహిళలకు 12 నుంచి 13 స్థానాలు వరకు దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో లోక్సభ స్థానాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 2009లో పునర్విభజనతో రద్దయిన పార్లమెంటు స్థానాలను మరోసారి పునరుద్ధరించే ఛాన్స్ కనిపిస్తోంది. జనాభా లెక్కల్లో పెరిగిన మహిళల శాతాన్ని బట్టి వారికి సైతం కేటాయించే సీట్లు పెరుగుతాయి.
* పెరగనున్న మహిళల ప్రాతినిధ్యం..
ప్రస్తుతం ఏపీ నుంచి లోక్ సభకు ముగ్గురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మహిళా బిల్లు వస్తే 12 నుంచి 13 పార్లమెంట్ సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు కూడా పెరగనున్నాయి. ఎస్టి రిజర్వుడ్ కు సంబంధించి అరకు ఉంది. పునర్విభజనతో మరో నియోజకవర్గం పెరిగే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఎస్సీ జనాభా 84.69 లక్షలు. 4 ఎస్ సి పార్లమెంట్ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఉభయగోదావరి తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎస్సీ నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో సైతం మహిళలకు ఎక్కువగా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
* కుటుంబ సభ్యులను రెడీ చేస్తున్న నేతలు..
ఒకవైపు నియోజకవర్గాల పునర్విభజన, మరోవైపు మహిళా బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలతో పాటు శాసనసభ నియోజకవర్గాలు మహిళలకు ఎక్కువగా దక్కే అవకాశం ఉంది. గతం కంటే వారి ప్రాతినిధ్యం పెరగనుంది. అయితే ఇప్పటికే నాయకులు తమ కుటుంబ సభ్యులను సిద్ధం చేస్తున్నారు. రాజకీయ పార్టీల ద్వారా పరిచయం చేస్తున్నారు. పార్లమెంట్లో డిలిమిటేషన్ బిల్లుతోపాటు మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
