ABN Andhra Jyothy: ఇటీవల వేమూరి రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతి పత్రిక.. ఏబీఎన్ ఛానల్ కోసం కొత్త భవనం నిర్మించుకున్నారు. విజయదశమి పండగ సందర్భంగా కొత్త ఆఫీసులో అధికారికంగా కార్యకలాపాలు కూడా మొదలుపెట్టారు. అతిరథ మహారధులు హాజరైన ఈ కార్యక్రమంలో.. వేమూరి రాధాకృష్ణ తనకు కేటాయించిన సీటులో ఆసీనులు అయ్యారు.
ఒక మీడియా అధినేతగా వేమూరి రాధాకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు.. రాజకీయ నాయకులకు సుపరిచితుడు. ఎక్కడో నిజామాబాద్ లో పుట్టారు ఆర్కే. అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇక్కడి దాకా వచ్చారు. ఒకరకంగా తెలుగు మీడియా రంగంలో మూతబడిన పత్రికను చేతుల్లోకి తీసుకొని.. 25 ఏళ్లపాటు విజయవంతంగా నడిపించడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని చేతల్లో చేసి చూపించారు రాధాకృష్ణ. ఒక రకంగా ఇది ప్రపంచ మీడియా చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం.
రాధాకృష్ణకు కుమార్తె అనూష.. కుమారుడు ఆదిత్య ఉన్నారు. అనూషకు భాను ప్రకాష్ తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. ఆదిత్యకు శృతి కీర్తితో వివాహం జరిగింది. వీరికి కూడా ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పుడు రాధాకృష్ణ వెంట కుమారుడు ఆదిత్య.. కుమార్తె అనూష.. కోడలు శృతి కీర్తి ఉన్నారు.. అల్లుడు భాను ప్రకాష్ కనిపించలేదు.
భాను ప్రకాష్ ఏబీఎన్ వ్యవహారాలలో చురుకుగా ఉంటారు. ఇటీవల కాలంలో ఆయనకు చానల్లో ప్రాధాన్యం తగ్గిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనికి తోడు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలకు సంబంధించి గతంలో వేమూరి రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. ఇతర హోదాలలో కుమారుడు.. కుమార్తె.. కోడలు ఉండేవారు. అయితే ఇప్పుడు రాధాకృష్ణ చైర్మన్ హోదాలోకి వెళ్లిపోయారు. ఎండిగా ఆదిత్య ప్రమోట్ అయ్యారు. ఇక మిగతా స్థానాలలో అనుష.. శృతి కీర్తి ఉన్నారు. వాస్తవానికి గతంలో బోర్డు మెంబర్ స్థానంలో భాను ప్రకాష్ ఉండేవారు. ఇప్పుడు ఆయన స్థానం కనిపించడం లేదు..
కొన్ని సోషల్ మీడియా గ్రూపులలో.. న్యూస్ వెబ్సైట్లలో భాను ప్రకాష్ ను తొలగించారని ప్రచారం మొదలైంది. అయితే దీనిపై భాను ప్రకాష్ ఎట్టకేలకు స్పందించారు. తనను ఎవరూ తొలగించలేదని.. తాను ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థలలో పనిచేస్తున్నానని.. వ్యతిరేక ప్రచారాన్ని నమ్మకూడదని సూచించారు. అనవసరమైన కథనాలను ప్రసారం చేయవద్దని హితవు పలికారు. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతి జగన్, షర్మిల మధ్య జరుగుతున్న వ్యవహారాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఆంధ్రజ్యోతి పత్రిక లో మాత్రమే ఈ కథనాలు ప్రచురితమవుతున్నాయి. అయితే అల్లుడు భాను ప్రకాష్ ను బయటికి పంపించారని వైసీపీ నేతలు తెగ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందువల్లే భాను ప్రకాష్ స్పందించారని.. తమ కుటుంబంలో ఎటువంటి వివాదాలు లేవని.. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు అంతకంటే లేవని కుండ బద్దలు కొట్టారు.