Vemuri Radhakrishna: తెలుగు మీడియా రంగంలో ఎంతమంది ఉన్నప్పటికీ రామోజీరావు స్థాయి వేరు. ఆయన బతికి ఉన్నప్పుడు దేశ ప్రధానమంత్రిని సైతం తన రామోజీ ఫిలిం సిటీకి రప్పించుకునేవారు. అంతటి స్థాయి ఉన్న రామోజీరావు కేసీఆర్ విషయంలో మాత్రం తలవంచాల్సి వచ్చింది. నేరుగా తన వద్దకు పిలిపించుకోకుండా.. కెసిఆర్ వద్దకే రామోజీరావు రావాల్సి వచ్చింది. అదొక చరిత్ర. ఇప్పటికీ మీడియా సర్కిల్ లలో ఆ ఘటన గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. అంతటి గండర గండడు అయిన రామోజీరావు ను తనదాకా పిలిపించుకున్నాడు అంటే.. తన దాకా రప్పించుకున్నాడు అంటే కెసిఆర్ రేంజ్ ఏమిటో తెలుసుకోవచ్చని గులాబీ నేతలు ఇప్పటికి ఎలివేషన్లు ఇస్తూనే ఉంటారు.
రామోజీరావు గతించి ఏడాది దాటింది. మరి ఇప్పుడు తెలుగు మీడియా రంగంలో ఆ స్థాయి అందుకున్న వ్యక్తి ఎవరు.. అసలు రామోజీరావు స్థాయికి వచ్చేవాళ్ళు ఉన్నారా.. రామోజీరావు నెలకొల్పిన సంస్థలకు కిరణ్ చైర్మన్గా కొనసాగుతున్నారు. రామోజీరావు బతికి ఉన్నప్పుడే తన తదుపరి తరాన్ని కూడా సిద్ధం చేశారు. కిరణ్ ముగ్గురు కుమార్తెలు.. సుమన్ కుమార్తె, కుమారుడు ఆల్రెడీ రామోజీరావు, నెలకొల్పిన సంస్థల బాధ్యతలను చూసుకుంటున్నారు. రామోజీరావు వారసుడు కిరణ్ అవుతారేమో గాని.. తెలుగు నాట మీడియా మొగల్ గా మాత్రం కాలేరని సీనియర్ జర్నలిస్టులు చెబుతుంటారు. మరి రామోజీరావు వదిలిపోయిన స్థానాన్ని అందుకునే స్థాయి ఎవరికి ఉంది..
ఇప్పుడు ఈ ప్రశ్నకు వేమూరి రాధాకృష్ణ పరోక్షంగా సమాధానం చెప్పారు. మూతబడిన ఆంధ్రజ్యోతి పత్రికను 2002 అక్టోబర్ 16న మళ్లీ ప్రారంభించారు. ఒక రకంగా తెలుగు మీడియా రంగంలోనే కాదు.. యావత్ భారత దేశ మీడియా రంగంలోనే అదొక చరిత్ర. అదే సంస్థలో ఒక రిపోర్టర్ గా పనిచేస్తున్న రాధాకృష్ణ.. ఆంధ్రజ్యోతి పత్రికను కొనుగోలు చేయడం.. దానిని క్రమక్రమంగా విస్తరించడం.. పత్రికకు అనుబంధంగా ఏబీఎన్ ఛానల్ ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. ఈ క్రతువులో రాధాకృష్ణ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరెన్నో కష్టాలు పడ్డారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్లారు. అదే సమయంలో తనకు కలిసి వచ్చే వ్యక్తులకు భుజాన్ని అందించారు. ఇలా క్రమక్రమంగా తన పత్రికను ఏకంగా రజతోత్సవ స్థాయి దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు ఏకంగా హైదరాబాదులోని ఫిలింనగర్ మెయిన్ రోడ్ నంబర్ 82 లో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. దీని దసరా రోజున ప్రారంభించారు. ఏబీఎన్.. ఆంధ్రజ్యోతి రెండు సంస్థలు కూడా ఒకే కార్యాలయంలో పనిచేస్తాయి. ఇన్ని రోజులపాటు ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిస్టు కాలనీలో.. ఏబీఎన్ ఛానల్ అపోలో ఆసుపత్రి వెనుకవైపు ఉన్న కార్యాలయంలో పనిచేసేవి.
ఈ కార్యాలయం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలియదు కానీ.. టీవీ5.. టీవీ9.. ఈనాడు స్థాయిలో ఈ బిల్డింగ్ ఉంది. దీనిపై రకరకాల విమర్శలు.. ఇంకా అనేక రకాల మాటలు వినిపిస్తున్నాయి.. రాధాకృష్ణ మీద ఒక సెక్షన్ ఎప్పటికీ మండిపడుతూనే ఉంటుంది. కొత్త కార్యాలయంలోకి వచ్చిన తర్వాత వారి మంట మరింత పెరిగింది. కొత్త కార్యాలయంలోకి ఏబీఎన్.. ఆంధ్రజ్యోతి ప్రవేశించిన తర్వాత.. ఇప్పుడు తెలుగు మీడియా రంగంలో రామోజీరావు స్థాయిని రాధాకృష్ణ అందుకున్నట్టేనా.. పైగా ఏపీలో కూడా ఆంధ్రజ్యోతి పత్రికకు పెద్ద కార్యాలయం ఉంది. ఈనాడుతో పోల్చి చూస్తే అది చాలా పెద్దది. సాక్షి కి కూడా ఆ స్థాయిలో బిల్డింగ్ లేదు. అలాంటప్పుడు రాధాకృష్ణకు రామోజీరావు స్థాయి వచ్చినట్టే కదా అని కొంతమంది మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. పైగా రాధాకృష్ణ కొత్త బిల్డింగ్ ను ప్రారంభించిన తర్వాత నవయుగ గ్రూపు వ్యవస్థాపకులు విశ్వేశ్వరరావు.. బొల్లినేని కృష్ణయ్య.. కే లక్ష్మీనారాయణ వంటి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. నేరుగా రాధాకృష్ణను కుర్చీలో కూర్చోబెట్టారు. ఒకప్పుడు ఈ స్థాయి వ్యక్తులు రామోజీరావుకు అండగా ఉండేవారు. ఇప్పుడు రాధాకృష్ణకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇంతకంటే చెప్పాలా.. రామోజీరావు స్థాయి రాధాకృష్ణకు వచ్చిందని.. ఆంధ్ర జ్యోతిలో పనిచేసే ఉద్యోగులు అంటున్నారు.
కానీ ఒక మాట.. ఒకప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధినేత గోయంకా ఇంట్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి వేడుకను కవర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ విషయం గోయంకా కు తెలియదు. పేపర్ డెడ్ లైన్ ముగిసిపోతున్న నేపథ్యంలో.. ఉద్యోగులలో ఆందోళన పెరిగిపోయింది. ఈ విషయం గోయంకా కు తెలిసింది. దీంతో ఆయన గట్టిగా నవ్వేశారు. చివరికి తన అటువంటి ప్రచారం అవసరం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తులు మీడియా రంగంలో ఉన్నారా.. మీడియా అధినేతల కూడా సొంత ప్రచారాన్ని కోరుకుంటున్నారు కదా.. అందుకు రామోజీరావు.. రాధాకృష్ణ మినహాయింపు కాదు. గతంలో రామోజీరావు తన మనవరాళ్ల పెళ్లిళ్ల విషయంలో కూడా తన పత్రికలో గొప్పగా రాసుకున్నాడు. ఇప్పుడు రాధాకృష్ణ కూడా అదే చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే మా పేపర్.. మా డప్పు.. మా కులం.. పాత్రికేయం లేదు.. దమ్ము అంతకంటే లేదు. అంతా బభ్రజమానం.. భజగోవిందం