US Soldier : అమెరికాలో వెటరన్స్ డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల స్మారక చిహ్నం వద్దే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆయన బృందం వ్యవహరించిన తీరుపై విధుల్లో ఉన్న ఓ ఆర్మీ సైనికుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. పవిత్రమైన స్మారక స్థలం వద్ద మాట్లాడటం, నవ్వుకోవడం తగదంటూ బహిరంగంగానే హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
నవంబర్ 11న అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఉన్న ఆర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీలో ఈ ఘటన జరిగింది. వెటరన్స్ డే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హాజరయ్యారు. దేశ రక్షణ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుర్తుతెలియని సైనికుడి సమాధి వద్ద (Tomb of the Unknown Soldier) ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన భార్య జెన్నిఫర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో కలిసి అక్కడ ఫొటోలు దిగారు. ఫొటోలు తీసుకోవడం పూర్తయిన తర్వాత బృందంలోని కొందరు అధికారులు అక్కడే నిలబడి మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ప్రారంభించారు.
అయితే ఆ సమయంలో స్మారక స్థలానికి కాపలాగా ఉన్న అమెరికా ఆర్మీ సైనికుడు వారి ప్రవర్తనను గమనించాడు. వెంటనే తన పెట్రోలింగ్‌ను ఆపి, అక్కడి నిబంధనలను గుర్తుచేస్తూ గట్టిగా హెచ్చరించాడు. “సందర్శకులందరూ ఎల్లప్పుడూ నిశ్శబ్దం, గౌరవప్రదమైన వాతావరణాన్ని పాటించాలి” అని స్పష్టంగా ప్రకటించాడు.
ఆ సైనికుడి హెచ్చరికతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. స్మారక స్థలం పవిత్రతను, అక్కడ పాటించాల్సిన క్రమశిక్షణను గుర్తుచేస్తూ అతడు వ్యవహరించిన తీరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. హోదాలతో సంబంధం లేకుండా అక్కడి నియమాలు అందరికీ ఒకటేననే విషయాన్ని ఈ ఘటన మరోసారి చర్చకు తీసుకొచ్చింది.
స్పందించిన పెంటగాన్
ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందించారు. విధుల్లో ఉన్న సైనికుడు సరైన విధంగానే వ్యవహరించాడని ఆయన పేర్కొన్నారు. స్మారక స్థలంలో పాటించాల్సిన నియమాలను సందర్శకులకు గౌరవప్రదంగా గుర్తుచేశాడని తెలిపారు.
అదే సమయంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, రక్షణ శాఖ అమెరికా సైనికుల త్యాగాలను ఎంతో గౌరవిస్తాయని స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల సేవలను ఎప్పటికీ మరువబోమని పేర్కొన్నారు.
వెటరన్స్ డే వేడుకల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన అమెరికాలో చర్చకు దారితీసింది. సాధారణ సందర్శకులైనా, దేశ అత్యున్నత స్థాయి అధికారులు అయినా యుద్ధ స్మారక స్థలాల్లో నిశ్శబ్దం, గౌరవం పాటించాల్సిందేనని ఈ సంఘటన గుర్తుచేసింది. విధి నిర్వహణలో ఉన్న ఓ సైనికుడు తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాడనే అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.