Kyrgyzstan: కిర్గిస్థాన్ లో అల్లర్లు.. తెలుగు విద్యార్థులకు నరకం.. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..

కిర్గిస్థాన్ లో విదేశీ విద్యార్థులపై కొంతమంది దాడులు చేస్తున్నారు.. దీంతో అక్కడ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. రాజధాని బిష్కెక్ లో అల్లరి మూక హింసకు పాల్పడుతున్న నేపథ్యంలో.. భారతీయ విద్యార్థులు ఎవరూ బయటికి రావద్దని రాయబార కార్యాలయం హెచ్చరించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 19, 2024 5:29 pm

Kyrgyzstan

Follow us on

Kyrgyzstan: శీతల దేశమైన కిర్గిస్థాన్ లో అల్లర్లు చెలరేగుతున్నాయి. రాజధాని బిషేక్ లో విదేశీ విద్యార్థులను టార్గెట్ గా చేసుకొని కొంతమంది హింసకు పాల్పడుతున్నారు. దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గతవారం బిష్కెక్ లో ఈజిప్ట్ విద్యార్థులకు, ఆ దేశ విద్యార్థులకు గొడవలు జరిగాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఫలితంగా విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని స్థానికంగా ఉన్న అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. ఈ ఘటనలో పలువురు పాకిస్తాన్ దేశానికి చెందిన విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు..కిర్గిస్థాన్ స్థానిక విద్యార్థులు, అల్లరి మూకలు.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన విద్యార్థులనే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో భారతీయ రాయబార కార్యాలయం మన దేశ విద్యార్థులకు పలు హెచ్చరికలు జారీ చేసింది.

కిర్గిస్థాన్ లో విదేశీ విద్యార్థులపై కొంతమంది దాడులు చేస్తున్నారు.. దీంతో అక్కడ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. రాజధాని బిష్కెక్ లో అల్లరి మూక హింసకు పాల్పడుతున్న నేపథ్యంలో.. భారతీయ విద్యార్థులు ఎవరూ బయటికి రావద్దని రాయబార కార్యాలయం హెచ్చరించింది. అల్లరి మూక దాడుల వల్ల పాకిస్తాన్ విద్యార్థులు గాయపడ్డారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. మెడికల్ కాలేజీల్లోని హాస్టల్లో ఉండే విద్యార్థులు.. స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్టళ్లకు మారారు. అక్కడ భద్రత పరంగా సమగ్ర చర్య లేకపోవడంతో తాము ప్రైవేట్ హాస్టళ్లకు మారామని భారతీయ విద్యార్థులు చెబుతున్నారు..” ఇక్కడ పరిస్థితి ఏమాత్రం మారలేదు. అల్లరి మూకలు రోజురోజుకు చేలరేగిపోతున్నాయి. దాడులకు పాల్పడుతున్నాయి. మాకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. పరిస్థితి చూస్తే భయానకంగా ఉందని” నల్గొండకు చెందిన ఓ విద్యార్థిని వాపోయింది.. పరిస్థితి ఇంతకు దిగజారినప్పటికీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది..” మన విద్యార్థులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నాం. వారికి సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా తెలుసుకుంటున్నాం.. స్థానిక ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నాం.. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు. ఒకవేళ సమస్య ఉంటే అక్కడే ఉన్న రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి.. హెల్ప్ లైన్ నెంబర్ 0555710041 ను సంప్రదించాలని” భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

ఇక కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సైతం ఈ వివాదం పై స్పందించారు.. ట్విట్టర్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు..” విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దు. అవసరమైతే ఇండియన్ ఎంబసీని సంప్రదించాలి. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. విద్యార్థుల భద్రతను పర్యవేక్షిస్తున్నాం. అక్కడి అధికారిక నివేదికల ప్రకారం శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నాయని తెలుస్తోంది. విద్యార్థులు టచ్ లో ఉండాలని సూచించామని” జై శంకర్ పేర్కొన్నారు.

కాగా, 13న ఈజిప్ట్, కిర్గిస్థాన్ ప్రాంతానికి చెందిన విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే గొడవలకు కారణమని తెలుస్తోంది. ఈ దాడులలో ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు చనిపోయినట్టు సోషల్ మీడియాలో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిని అక్కడి స్థానిక ప్రభుత్వం తోసిపుచ్చింది. విదేశీ విద్యార్థులు చనిపోలేదని ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ ఎంబసీ కూడా ఈ వివాదం పై స్పందించింది. ఈజిప్ట్ విద్యార్థుల దాడుల వల్లే ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని ప్రకటించింది. అల్లరి మూకలు బిష్కెక్ లో వైద్య విశ్వవిద్యాలయం లోని వసతిగృహాలపై దాడులు చేస్తూ.. భారత్, పాకిస్తాన్ విద్యార్థులపై భౌతిక దాడులు చేస్తున్నారని పేర్కొంది. ” భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులను అల్లరి మూకలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ దేశానికి చెందిన పలువురు విద్యార్థులకు గాయాలైనట్టు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ దేశానికి చెందిన కొంతమంది విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు ఎవరూ మాకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని” పాకిస్తాన్ ఎంబసీ పేర్కొంది.