Saudi Arabia : తినేందుకు తిండి లేక.. తాగేందుకు నీరు దొరకక.. సౌదీఎడారిలో తెలంగాణ వాసి మృత్యుగీతిక..!

విదేశాల్లో తెలుగువారి మరణాల పరంపర కొనసాగుతోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో కొనసాగిన మరణాలు ఇప్పుడు గల్ఫ్‌కు పాకాయి. ఉపాధి కోసం ఇండియా నుంచి ఏటా వేల మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్తుంటారు. అయితే ఏజెంట్‌ మోసాలతో అక్కడ సరైన ఉపాధి లేక మనస్తాపంతో కొందరు చనిపోతుంటే.. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 25, 2024 2:03 pm

telangana man struck in deseart

Follow us on

Saudi Arabia : ఉన్నత చదవులు చదివిన వారికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేతోపాటు అపలు దేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుతోపాటు ఉద్యోగాల కోసం ఆయా దేశాలకు పంపుతున్నారు. ఇక ఒకప్పుడు సంపన్న కుటుంబాలకే పరిమితమైన డాలర్‌ డ్రీమ్‌ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలకు చేరువైంది. దీంతో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక చదువు రానివారు నిర్మాణరంగంలో నైపుణ్యం ఉన్నవారు ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నారు. అక్కడ నిర్మాణరంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడంతో చాలా మంది సౌదీ, దుబయ్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్‌ దేశాలకు వెళ్తున్నారు. అక్కడ భద్రతతోపాటు వేతనాలు కూడా ఎక్కువగ ఉండడంతో నాలుగైదేళ్లు అక్కడే ఉండి రావాలని చాలా మంది ఏజెంట్ల సాయంతో గల్ఫ్‌ బాట పడుతున్నారు. ఇక అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పోలిస్తే గల్ఫ్‌ దేశాలు మనకు దగ్గరగా ఉన్నాయి. ఈ దేశాలకు వెళ్లేందకు అయ్యే ప్రయాణ ఖర్చులు కూడా తక్కువే. నిబంధనలు, ఆంక్షలు కూడా లేవు. దీంతో పురుషులతోపాటు మహిళలు కూడా గల్ఫ్‌ వెళ్తున్నారు. అయితే ఇదే అదనుగా కొంతమంది ఏజెంట్లు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి విజిట్‌ వీసాపై గల్ఫ్‌ దేశాలకు పంపుతున్నారు. ఇలా వెళ్లినవారు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పట్టుబడి జైళ్లలో మగ్గుతున్నారు. కొందరు ఉత్త చేతులతో రాలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొందరు ఎడారి దేశాల్లో తప్పిపోయి మృత్యువాతపడుతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన యువకుడు సౌదీ అరేబియాలో మృతి చెందాడు.

దారితప్పి ఎడారిలో చిక్కుకని..
కరీంనగర్‌కు చెంది 27 ఏళ్ల షెహజాద్‌ ఖాన్‌ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా ఐదు రోజుల క్రితం తన సహోద్యోగి అయిన సూడాన్‌ వాసితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాడు. కానీ వారు వెళ్లే సమయంలో జీపీఎస్‌ సక్రమంగా పనిచేయలేదు. దీంతో వారిద్దరూ దారి తప్పిపోయారు. వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రుబా అల్‌ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక వాహనాన్ని అలాగే పోనిస్తూ ఉండగా అందులో పెట్రోల్‌ అయిపోయింది. తాము దారితప్పామనే విషయం మేనేజ్‌ మెంట్‌కుచెబుదామన్నా కూడా ఇద్దరి మొబైల్స్‌ స్విచ్చాఫ్‌ అయ్యాయి.

నడుచుకుంటూ వెళ్దామని..
దీంతో జనావాసాలు ఉన్న చోటుకు నడుచుకుంటూ అయినా వెళ్లిపోదామని షహబాద్‌ ఖాన్, అతని సహచరుడు అనుకున్నప్పటికీ.. ఎటుచూసినా ఎడారే కనబడటంతో ఏం చేయాలో పాలుపోలేదు. తమను ఆ దేవుడు కాపాడకపోతాడా అని అక్కడే ఎడారిలో నమాజ్‌ చేసుకుంటూ ఉండిపోయారు. పైన ఎండ, కింద ఇసుక వేడితో వాళ్లు డీహైడ్రేషన్‌ కు గురయ్యారు. తాగేందుకు నీరు, తినడానికి అహారం లేక అక్కడే ప్రాణాలొదిలారు. సర్వీస్‌ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా వెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎడారిలో వారి వాహనం పక్కనే విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ గుర్తించారు. పోలీసులు. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.