Bigg Boss Telugu 8 : హైదరాబాద్ లోని మాదాపూర్ సమీపంలో గల తుమ్మిడి కుంట చెరువును అనుకుని అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చి వేశారు. తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు ఆగస్టు 25 శనివారం ఉదయం ఎన్ కన్వెన్షన్ కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే తాను ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని .. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారు. ఈ విషయం కోర్టులో తేల్చుకుంటాం అని నాగార్జున సవాల్ చేశారు. కాగా కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో నాగార్జున పై తీవ్ర విమర్శలు చేశాడు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని.
‘ చెరువు భూమి అంటే అది ప్రజలందరి భూమి. అలాంటి భూమిని నిర్లజ్జగా కబ్జా చేసి .. ఎటువంటి భయం లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వర్షపు నీరు ఎక్కడకి పారకుండా చేసి .. ఆ ప్రాంతంలో వరద పరిస్థితులకు కారణం అయ్యారు. చుట్టుపక్కల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. వారికున్న స్టూడియోస్ స్థలాలు చాలవు అన్నట్టు, ఒక కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు.
ఇతర సంపన్నుల వద్ద ప్రతి రోజూ లక్షల రూపాయలు అద్దెలు రూపంలో వసూలు చేసి .. అధికారంలో ఉన్న నేతలతో లోపాయకారి ఒప్పందాలతో తమ ప్రయాజనాలను కాపాడుకున్న వారికి శిక్ష ఇది కాదు. ఇది కరెక్షన్ మాత్రమే. అక్రమ కట్టడాన్ని కూల్చడమే కాదు. ఆ కన్వెన్షన్ యజమానులకు, అనుమతులు ఇచ్చిన అధికారులకు శిక్ష పడాలి. 2010 నుండి ఇప్పటి వరకు ఎన్ కన్వెన్షన్ ద్వారా వసూలు చేసిన అద్దెలు ప్రజలకు చెందినవే. వాటిని మున్సిపల్ కార్పొరేషన్ తిరిగి వసూలు చేసుకోవాలి.
అవి చెల్లించే వరకు వరకు ఆ యాజమాన్యం ఆస్తులు జప్తు చేసుకోవాలి. పనిలో పనిగా బిగ్ బాస్ హోస్ట్ గా కూడా వేరే ఇంకెవరైనా మర్యాదస్తులను నియమించుకోవాలి. నగరంలో వందల సంఖ్యలో ఉన్న ఇలాంటి అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అంటూ… ఫేస్ బుక్ లో బాబు గోగినేని సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం గోగినేని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బాబు గోగినేని ప్రముఖ మానవతావాది, హేతువాది.
బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్నాడు. అప్పట్లో కౌశిక్ కి సపోర్ట్ గా ఉంటూ హౌస్ లో తెగ హడావిడి చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. అప్పుడప్పుడు ఇటువంటి పోస్టులు పెడుతూ వార్తల్లో నిలిస్తుంటాడు బాబు గోగినేని.