Anurag institutions : బీఆర్ఎస్ ఎమ్మెల్యే బుక్కైనట్టే.. ఆయన విద్యాసంస్థలు కూలినట్టే.. హైడ్రా అడుగులపై అందరి ఆసక్తి..

 సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు పడగొట్టిన తర్వాత.. తదుపరి చర్యలు ఎవరి మీద ఉంటాయి? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. దీంతో అన్ని వేళ్ళూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పై వైపు చూపిస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 25, 2024 1:45 pm

Anurag institutions

Follow us on

Anurag institutions : శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇదే సమయంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై పోచారం ఐటిసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అనురాగ్ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అయితే ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనురాగ్ విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్.. మేడ్చల్ జిల్లాలోని నాడెం చెరువు బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టాయని నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ది తో కేసు నమోదయింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ పంచాయతీలోని కొర్రెముల రెవెన్యూ పరిధిలోని 813 సర్వే నెంబర్లు ఈ విద్యాసంస్థలు వివిధ నిర్మాణాలు చేపట్టాయి. అయితే ఆ చెరువుకు 30 మీటర్ల బఫర్ జోన్ వదిలిపెట్టి నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అయితే యాజమాన్యం ఆ నిబంధనను పక్కనపెట్టి నిర్మాణాలు చేపట్టింది. ఈ క్రమంలో ఘట్కేసర్ మండల ఇరిగేషన్ ఏఈ పరమేష్.. ఈనెల 22న బఫర్ జోన్ లోని నిర్మాణాలను పరిశీలించారు. వాల్టా చట్టంలోని పలు సెక్షన్లను పేర్కొంటూ పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు నంగార భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ నాయక్ అనురాగ్ విద్యాసంస్థల ఆక్రమణలపై కలెక్టర్, నేటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బఫర్ జోన్ లోనూ నిర్మాణాలు చేపట్టిన అనురాగ్ విద్యా సంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.

హైకోర్టును ఆశ్రయించిన విద్యాసంస్థలు

మరోవైపు హైడ్రా తమ ఆస్తుల విషయంలో పరిధికి మించి జోక్యం చేసుకుంటుందని.. కూల్చివేతలను చేపట్టకూడదని పేర్కొంటూ రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇందులో అనురాగ్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి చెందిన అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్, నీలిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి సంస్థలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కురెముల గ్రామంలోని 823/ ఈ, 813/ఈఈ, 813/ఏఏ/2, 813/ ఏ ఏ/ 1796 సర్వే నెంబర్లలో 17.21 ఎకరాల భూమి, ఇతర నిర్మాణాలపై హైడ్రా అధికారులు జోక్యం చేసుకొని.. విచారణ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆ విద్యాసంస్థలు ఫిర్యాదుల పేర్కొన్నాయి. హైడ్రా నిలువరించకపోతే.. తమ నిర్మాణాలను పడగొట్టే ప్రమాదం ఉందని ఆ విద్యాసంస్థల బాధ్యులు పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యాసంస్థల ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. నిబంధన ప్రకారం నడుచుకోవాలని సూచించింది. ఈ ప్రకారం ప్రభుత్వ న్యాయవాది హామీ ఇవ్వడంతో కేసు ముగిసింది .

పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏమంటున్నారంటే..

మరోవైపు అనురాగ్ విద్యాసంస్థలపై వస్తున్న ఆరోపణలపై ఆ విద్యాసంస్థల చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి స్పందించారు. ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో ప్రభుత్వం ఈ ఈ సంవత్సరం వివిధ కోర్సుల్లో 480 సీట్లలో కోత విధించింది అన్నారు. తమ కళాశాలకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని వాపోయారు. ఇప్పటికే తమ విద్యాసంస్థలపై విజిలెన్స్, ఇంటలిజెన్స్, రెవెన్యూ, నీటిపారుదల, విద్యాశాఖ అధికారులు నిత్యం సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నట్టు కనిపించకపోవడంతో.. నీటిపారుదల శాఖ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చి తమపై మరో కేసు నమోదు చేశారని ఆయన వివరించారు. ఈ కేసు వల్ల తమ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆయన వాపోయారు.