నిన్నటి అఖిలపక్ష వీడియో సమావేశం మంచి వాతావరణంలో జరిగింది. చైనాతో జరుగుతున్న ఘర్షణలో అన్ని పార్టీల నాయకులను విశ్వాసం లోకి తీసుకోవటం అభినందించదగ్గ విషయం. ఇటువంటి సమయాల్లో అందరిని కలుపుకొని వెళ్ళటం ఎంతో అవసరం. దానికి తగ్గట్టుగానే అందరూ కూడా ప్రభుత్వం వెనక నిలబడటమే కాకుండా మోడీని అభినందించటం కూడా జరిగింది. ఒక్క సోనియా గాంధీ మాత్రమే భిన్న స్వరాన్ని వ్యక్తపరచింది. ఆమెకు మద్దత్తుగా ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా నిలబడలేదు. ఈ సమయంలో రాజకీయాలకు తావులేదనే సెలవిచ్చారు. ఇది శుభ పరిణామం. మహాభారతం లో ధర్మరాజు చెప్పినట్లు మాలోమాకు ఎన్ని తగాదాలున్నా బయటివాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మేము 105 మందిమి ఒక్కటే . అదే సూత్రం , అదే వారసత్వం ఇప్పుడు కొనసాగాలి. దురదృష్టవశాత్తూ సోనియా గాంధీ ఆ లైన్ తీసుకోకపోవటం విచారకరం.
అంతవరకూ బాగానే వున్నా చివరలో మోడీ చేసిన తుది పలుకులు మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అమరవీరులకు జోహార్లు అర్పించటం, సైన్యాన్ని ప్రశంసించటం లాంటి మాటలు ఉత్తేజాన్నిఇచ్చినా రెండు వాక్యాలు అందరినీ ఒక్క నిముషం షాక్ కి గురిచేసినాయి. మన భూభాగం లోకి ఎవరూ చొరబడలేదని, ఇప్పుడూ ఎవరూ లేరని, మన భారత పోస్టు ని ఎవరూ స్వాధీనం చేసుకోలేదని చెప్పటం ఒకనిముషం నోట మాట రాలేదు. అదేసమయంలో మన జవాన్లు గట్టి జవాబిచ్చారని చెప్పినా ముందు మాటలే అందరి చెవుల్లో ఏదో వినరానిది విన్నట్లుగా అనిపించింది. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి కొంచెం టైం పట్టింది.
నిజంగా చైనా మన భూభాగం లోకి చొచ్చుకు రాలేదా? రాకపోతే మన సైనికులు ఎందుకు బలిదానం చేసినట్లు? ఇది అందరి మదిలో కదిలాడే ప్రశ్న. వచ్చిన వారిని తిప్పికొట్టారని చెప్పటం వేరూ , అసలు మన భూభాగం లోకి రాలేదని వ్యాఖ్యానించటం ఆశ్చర్యంగా వుంది. మోడీ అలా ఎందుకు మాట్లాడవలిసి వచ్చిందో అంతుబట్టటంలేదు. ఒకవేళ వ్యూహాత్మకంగా ప్రస్తుతం పరిస్థితిని శాంతపరచాలని అనుకున్నా మోడీకి అ అధికారం వుంది. మోడీ ఏం చేసినా దేశాహితం కోసమే చేస్తాడని అనుకుంటారు. కాబట్టి అంతవరకూ ఇబ్బందిలేదు. కానీ అలా వ్యాఖ్యానించి వుండాల్సింది కాదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దులో రోడ్లు ఇతర మౌలిక సౌకర్యాలు త్వర త్వరగా నిర్మించటం, అధునాతన ఆయుధాలు, విమానాలు కొనటం , సైన్యం నైతిక బలాన్ని పెంచటం లాంటి అనేక చర్యలు చేపట్టిన మాట వాస్తవం. అంతమాత్రాన ఇలా మాట్లాడటం మింగుడుపడటం లేదు. దేశప్రజలందరికీ మోడీ పై పూర్తి విశ్వాసం వుంది. ఈ తరుణంలో ఇటువంటి మాటలు ప్రజల స్థైర్యాన్ని , నైతిక బలాన్ని దెబ్బ తీస్తాయి. ఇలా మాట్లాడి వుండాల్సింది కాదు. ఏదేమైనా ఇది దేశ ప్రజలకి పెద్ద షాకే.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Whether modi made self goal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com