CM Revanth Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (prime minister Narendra Modi) ని బడే భాయ్ అని సంబోధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Telangana chief minister revanth Reddy) గత కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బడ్జెట్ సందర్భంలో తెలంగాణకు అన్యాయం చేశారని నరేంద్ర మోడీపై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. చివరికి ఈ విషయాన్ని రాహుల్ గాంధీ కూడా చెప్పలేకపోయారు.
తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల్లో అభిమానాన్ని చూర గొనే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఆరు పథకాలను అమలు చేయడానికి మెల్లిమెల్లిగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కుల గణన సర్వే తీవ్ర విమర్శల పాలవుతోంది. సర్వే మొత్తం సరిగ్గా జరగలేదని.. ఇష్టానుసారంగా వివరాలు నమోదు చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కావాలనే కొన్ని వర్గాల జనాభాను తగ్గించారని.. మరికొన్ని వర్గాల జనాభాను పెంచి చూపించారని మండిపడుతున్నాయి. ఇక ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పక్షాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సర్వేలో పాల్గొనని వ్యక్తులు.. గత ప్రభుత్వ హయాంలో సర్వే చేసి.. వివరాలు బయటపెట్టని వ్యక్తులు ఇప్పుడు తమ మీద ఆరోపణలు చేయడం ఏంటని విమర్శిస్తోంది.
అసలు విషయం బయటపెట్టిన రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను గేమ్ చేంజర్ లాగా రాహుల్ గాంధీ చెప్పుకున్నారు. నిండు పార్లమెంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పని చేయాలని సవాల్ విసిరారు. అయితే దేశాన్ని కులాలవారీగా కాంగ్రెస్ పార్టీ విభజిస్తుందని భారతీయ జనతా పార్టీ మండిపడింది. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కుల గణనను దేశవ్యాప్తంగా గొప్పగా చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మలయాళ మనోరమ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అదే విషయాన్ని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాచిన అసలు విషయాన్నీ బయట పెట్టారు. నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదని.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ఆరోపించారు. 2002 వరకు మోడీ ఉన్నత కులాల్లో ఉన్నారని.. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీల్లో కలిపారని ఆరోపించారు. తాను ఈ వ్యాఖ్యలను ఆషామాషీగా చేయడం లేదని.. పూర్తి ఆధారాలతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఇంతవరకు ఈ స్థాయిలో మోడీ గురించి విమర్శలు చేసింది లేదు. విషయానుసారంగా మాట్లాడింది కూడా లేదు. పదే పదే తను చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నానని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. అయితే ఏకంగా నరేంద్ర మోడీకి సంబంధించి కీలకమైన విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో జాతీయ మీడియాలో ఈ వార్త ప్రముఖంగా ప్రసారం అవుతుంది.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన అనంతరం వెంటనే బిజెపి సోషల్ మీడియా అలర్ట్ అయింది. నరేంద్ర మోడీకి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాలను బయటపెట్టింది. కాకపోతే రేవంత్ రెడ్డి అప్పటికే చేయాల్సిన నష్టం చేసి వెళ్లిపోయారు.