Uttarandhra Ministers: ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ఎదురీదుతున్నారా? వచ్చే ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదా? ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా? సీనియర్ అమాత్యులు సైతం ఇంటిబాట పట్టనున్నారా? వైసీపీ హైకమాండ్ కు ఇదే విషయం తెలిసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐ ప్యాక్ టీమ్ సర్వే అంటూ సోషల్ మీడియాలో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఆరుగురు మంత్రులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఈ సర్వే సారాంశం. వచ్చే ఎన్నికల్లో ఒకరు కూడా గెలిచే పొజిషన్ లో లేరని తెలుస్తుండడం అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. 25 మంది మంత్రులు, తాజా మాజీ మంత్రులపై ఐ ప్యాక్ టీమ్ సర్వేచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, నారాయణస్వామి, పినిపె విశ్వరూప్, దాడిశెట్టి రాజాపేర్లు ‘గెలిచే అవకాశమున్న’ వారి జాబితాలో కనిపిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది.

ప్రధానంగా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు ఓటమి అంచున ఉండడం విశేషం. మంత్రి బొత్స సత్యనారాయణ పవర్ ఫుల్ లీడర్. విజయనగరం జిల్లాను తన కుటంబ సామ్రాజ్యంగా మలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పొజిషన్ కు వెళ్ళారు. పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. సీఎం అభ్యర్థిత్వానికి సైతం ఆయన పేరును పరిశీలించిన సందర్భం ఒకటి వచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన చీపురుపల్లి నుంచి ఓడిపోతారని సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. మంత్రిగా ఆయన అందుబాటులో ఉండకపోవడంతో నియోజకవర్గ ప్రజల అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. 2004 నుంచి చీపురుపల్లి నుంచి పోటీచేసిన బొత్సకు 2014లో మాత్రం ఓటమి ఎదురైంది. కానీ నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ద్వితీయ స్థానంలో నిలవడం విశేషం. నాడు వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన బెల్లాన చంద్రశేఖర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఈసారి చీపురుపల్లి నుంచి బొత్స గెలుపు అంత ఈజీ కాదట. అందుకే ఆయన వేరే నియోజకవర్గాన్ని వెతుక్కునే పనిలో ఉన్నట్టు సమాచారం.
మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎదురీదుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిపై ఏడు వేల ఓట్లతో మాత్రమే గెలుపొందారు. మూడేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఇటీవలే మంత్రి అయ్యారు. కానీ ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు లేదు. దీంతో అటు సొంత పార్టీ నాయకులతో పాటు నియోజకవర్గ ప్రజల్లో కూడా అసంతృప్తి నెలకొని ఉంది. రోజురోజుకూ ఆయనపై వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఐ ప్యాక్ తన సర్వేలో గుర్తించినట్టు సమాచారం.

మంత్రి సీదిరి అప్పరాజు పరిస్థితి కూడా బాగాలేదు. పలాస నియోజకవర్గంలో ఆయన సొంత పార్టీ నుంచే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు పెరుగుతుండడం, అనుచరులు దందాలకు దిగుతుండడం ఆయనకు మైనస్ గా మారింది. అటు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు లేకపోవడం, నిత్యం రాజకీయ వివాదాలు జరుగుతుండడంతో ప్రజల్లో ఒకరకమైన అసంతృప్తి పెల్లుబికినట్టు సమాచారం. మంత్రి చేసింది తక్కువ..ఆర్భాటం ఎక్కువ కావడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణంగా ఐ ప్యాక్ టీమ్ గుర్తించినట్టు సమాచారం.
మన్యం జిల్లా మంత్రి పీడిక రాజన్నదొర సైతం సాలూరు నియోజకవర్గంలో ఓటమి బాటలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన రాజన్నదొర విద్యాధికుడు, వివాదరహితుడు. దీంతో జగన్ మలి విడత విస్తరణలో రాజన్నదొరకు మంత్రి పదవి ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా కూడా ఎంపిక చేశారు. అయితే గిరిజనుల సమస్యలపై స్పందిస్తున్నా ప్రభుత్వం నుంచి నిధుల విడుదల లేకపోవడంతో ఆయనకు మైనస్ గా మారింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నానని రాజన్నదొర లోలోపల బాధపడుతున్నారు. సమస్యలు పరిష్కారం కాక నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆ ప్రభావం రాజన్నదొర గెలుపుపై చూపుతోంది.
ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలనుకుంటున్న మంత్రి బూడి ముత్యాలనాయుడుకు ఈసారి కష్టమేనని ఐ ప్యాక్ టీమ్ గుర్తించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ముత్యాలనాయుడికి చాన్సిచ్చారు. కీలక పోర్టుపోలియోలతో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. కానీ మంత్రిగా తన ముద్ర చూపుకోవడంలో ముత్యాలనాయుడు ఫెయిలయ్యారు. అటు మాడుగుల నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి లేకపోవడంతో ప్రజల్లో వైసీపీ సర్కారుపై విరక్తి పెరిగింది. ఆ ప్రభావం ముత్యాలనాయుడు గెలుపుపై చూపుతోంది.
అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఓటమి తప్పదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన అమర్నాథ్ కు మంత్రివర్గ విస్తరణలో అమాత్య పదవి కట్టబెట్టారు. కానీ ఆయనకు పార్టీలోనూ అసమ్మతి ఉంది. నియోజకవర్గ ప్రజల్లోనూ అసంతృప్తి నెలకొని ఉంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ ప్రగతి వైపు చూడకుండా నిత్యం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారన్న అపవాదు ఉంది. గత ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో గెలుపొందారు. ఈసారి అన్ని ప్రతికూలతల దృష్ట్యా అమర్నాథ్ ఓటమి తప్పదని ఐ ప్యాక్ టీమ్ నిర్థారించినట్టు తెలుస్తోంది.