Governor Tamilisai- KCR: ఆల్ ఈజ్ వెల్.. అంతా ప్రశాంతం.. తెలంగాణలో ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితి ప్రస్తుతం మారినట్లే కనిపిస్తోంది. కోర్టు మెట్ల వరకు వెళ్లిన వివాదం గవర్నర్ బడ్జెట్ ప్రసంగంతో సమసిపోయినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ కాపీని గవర్నర్ ఉన్నది ఉన్నట్లు చదివారు. దీంతో ప్రగతి భవన్, రాజ్‌భవన్ మధ్య రాజీ కుదిరిందా.. సీఎం, గవర్నర్ సయోధ్యకు వచ్చారా.. ఇకపై ఇదే సంప్రదాయం కొనసాగుతుందా.. పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులకు ఆమోదం లభిస్తుందా.. తెరవెనుక ఏం జరిగింది అన్న ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

రెండేళ్ల విరామం తర్వాత ఉభయ సభల్లోల ప్రసంగం..
తెలంగాణ గవర్నర్ తమిళిసై రెండేళ్ల విరామంత తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాళోజీ పదాలతో ప్రసంగం ప్రారంభించారు. రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలు, ప్రొటోకాల్ వివాదం, బీఆర్‌ఎస్ నేతలు గవర్నర్‌పై చేసిన విమర్శలు.. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంగా అధికార బీఆర్‌ఎస్‌ను ఒకింత టెన్షన్ పెట్టాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం చదువుతారా? సొంతంగా గవర్నర్ ఏమైనా మాట్లాడతారా;?, ఇటీవలి వివాదాలను లేవనెత్తుతారా?, కేంద్రానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ వీటన్నిటికీ గవర్నర్ ఫుల్‌స్టాప్ పెట్టారు. తెలంగాణ సర్కార్ ఇచ్చిన ప్రసంగాన్నే పొల్లు పోకుండా చదివారు. బీఆర్‌ఎస్ పాలనను ఆకాశానికి ఎత్తేశారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.
వివాదాలు ఇలా..
2019, సెప్టెంబర్ 8న గవర్నర్ తమిళిసై బాధ్యతలు చేపట్టారు. మొదట సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలే కొనసాగాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. పాడి కౌషిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడి నుంచే వివాదం మొదలైందన్న సమాచారం. తర్వాత ఏ కార్యక్రమానికి గవర్నర్‌ను ఆహ్వానిం^è కపోవడం, గవర్నర్ ఎక్కడికైనా వెళ్లినా ప్రొటోకాల్ పాటించకపోవడం, కనీసం హెలిక్యాప్టర్ కూడా సమకూర్చకపోవడం వంటి చర్యలకు ప్రభుత్వం దిగింది. మరోవైపు గవర్నర్ ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య గ్యాప్ మరింత పెరిగింది. కేంద్రం, ప్రధానిపై రాజకీయంగా ఉన్న విభేదాలను గవర్నర్‌పైనా కొనసాగించారు. బీఆర్‌ఎస్ నాయకులు గవర్నర్‌పై విమర్శలు చేసేవరకు పరిస్థితి వెళ్లింది. ఇటీవల గణతంత్ర వేడుకలను కూడా ప్రభుత్వం రాజ్‌భవన్‌లోనే నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కోర్టు జోక్యం చేసుకున్నా.. మొక్కుబడిగా నిర్వహించింది. మరోవైపు ఎమ్మెల్సీ పాడి కౌషిక్‌రెడ్డి గవర్నర్ తమిళిసైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రతిపాదన లను సర్కార్ రాజ్‌భవన్‌కు పంపించగా గవర్నర్ ఆమెదం తెలుపుతుందో లేదో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు తెలిపి పిటిషన్ ఉపసంహరించుకుంది.

రాజీ కుదిరినట్లేనా?
తాజా పరిణామాలు, గవర్నర్ బడ్జెట్ ప్రసంగం నేపథ్యంలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య రాజీ కుదిరినట్లే కనిపిస్తోంది. అయితే ఇది అసెంబ్లీ సమావేశాల వరకేనా.. లేక మున్ముందు కొనసాగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. సీఎం, గవర్నర్ మధ్య సయోధ్యకు తెరవెనుక ఏం జరిగిందన్న సందేహాలు విపక్ష నేతల మెదళ్లను తొలుస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ రాసిచ్చిందే గవర్నర్ చదవడంపై విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. మరోవైపుసొంత కవిత్వాన్ని గవర్నర్ జోడించకపోవడంతో అధికార బీఆర్‌ఎస్ ఊపిరి పీల్చుకుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. దీంతో కేంద్రం జోక్యంతో గవర్నర్, కేసీఆర్ సర్కార్ మధ్యన సంధి కుదిరిందని భావిస్తున్నారు.