Unstoppable With NBK Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు. అందుకు ఆయన వ్యక్తిత్వం కారణం. విలువలతో కూడిన మాటలు సిద్ధాంతాలతో మిళితమైన భావాలు ఆయన్ని కర్మయోగిగా మలిచాయి. అందుకే పవన్ ఓ స్టార్ హీరో కంటే కూడా గొప్ప మానవతావాది గా గుర్తింపు తెచ్చుకున్నారు. సమాజహితం ఆయన ప్రతి మాటలో, వేసే ప్రతి అడుగులో కనిపిస్తుంది. ప్రజల గురించి ఆలోచించే పవన్ తనని తానూ మార్చుకుంటూ వచ్చారు. సామాజిక విషయాలపై, రాజకీయ పరిస్థితులపై పరిణితి సాధించారు. అందరికీ మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

పవన్ వ్యక్తిత్వం ఏమిటీ? ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ ఏంటీ?… అనే విషయాన్ని హీరో బాలయ్య షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు. పవన్ తత్వాన్ని వివరిస్తూ ఆయన చెప్పిన మాటలు వంద శాతం నప్పుతాయి. ”నీ మాట విప్లవ గీతం. నీ అడుగు ఓ తరానికి చిహ్నం. నీ ఆలోచన నదీ ప్రవాహం. నీ ప్రశ్న రామబాణం… ఇదంతా ప్రజలకు తెలిసిన ప్రజల మనసు గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” అని బాలయ్య పవన్ గురించి నాలుగు వాక్యాల్లో చెప్పారు. పవన్ గురించి బాలయ్య చెబుతుంటే అభిమానులకు గూస్ బంప్స్ కలిగాయి. ఆయనపై మరింత ఆరాధన, గౌరవం కలిగింది.
పదవుల కోసం కాదు ప్రశ్నించడానికే నా రాజకీయ ప్రయాణమన్న పవన్ నిస్వార్థ నిరతిని చాటుకున్నారు. నిజంగా పవన్ మాట్లాడుతుంటే చరిత్రలో ఉన్న గొప్ప గొప్ప విప్లవ వీరులు గుర్తొస్తారు. ఆయన ప్రశ్నలు సూటిగా ప్రత్యర్థులను బెంబేలెత్తించే రామబాణాల్లా ఉంటాయి. తిరుగులేని పదును, వేగంతో దూసుకెళతాయి. పవన్ సంధించే రామబాణాల్లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రత్యర్ధులు సతమతమవుతూ ఉంటారు.

అన్ స్టాపబుల్ షో వేదికగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని మరింత గొప్పగా ఆవిష్కరించారు. పవన్ ఉన్నత భావాలు వెలికి తీశారు. ఫిబ్రవరి 2న ఆహాలో ప్రసారమైన ఫస్ట్ పార్ట్ రికార్డు బ్రేకింగ్ వ్యూవర్షిప్ సొంతం చేసుకుంది. పవన్ జీవితంలో చోటు చేసుకున్న అనేక ఆసక్తికర విషయాలు బాలయ్య-పవన్ మధ్య చర్చకు వచ్చాయి. ఇద్దరు స్టార్ హీరోల మధ్య సంభాషణ ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ మధ్యలో మధ్యలో ఫన్ తో సాగింది. ఈ క్రమంలో సెకండ్ పార్ట్ మీద మరింత హైప్ ఏర్పడింది. మొత్తంగా పవన్ ఎపిసోడ్ తో ఆహా యాప్ పెద్ద ఎత్తున లాభపడిన సూచనలు కనిపిస్తున్నాయి.