
Nannapaneni Rajakumari: టీడీపీ ఆవిర్భావం తరువాత ఎందరో మహిళలు రాజకీయ అరంగేట్రం చేశారు. ఎంతగానో రాణించారు. అటు సినీ గ్లామర్ సైతం పనిచేసింది. జయప్రద, శారద వంటి నాయకులు స్టార్ క్యాంపెయినర్లుగా ఉండేవారు. నన్నపనేని రాజకుమారి, ప్రతిభాభారతి వంటి సీనియర్లకు పార్టీ సముచిత స్థానమే కల్పించింది. కానీ ఇటీవల కాలంలో టీడీపీలో మహిళా నేతల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చాలామంది నేతలు పార్టీని వీడారు. ఇతర పార్టీల్లో చేరిపోయారు. అందుకే మునపటి కళ పోయింది. అయితే ఉన్న కొద్దిమంది మహిళా నేతలు రాజకీయాల్లో రాణించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వారసుల కోసమే ఏడు పదుల వయసులో కష్టపడుతున్నారు.కానీ అంతగా వర్కవుట్ కావడం లేదు. ప్రస్తుతం నన్నపనేనని రాజకుమారి, ప్రతిభాభారతి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు గుర్తింపునిచ్చిన టీడీపీలోనే గట్టి ప్రయత్నం చేయాలని డిసైడ్ అయ్యారు.
నన్నపనేనిది కీ రోల్
నన్నపనేని రాజకుమారి. 1983లోనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. టీడీపీ తరుపున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎన్టీఆర్ ని పదవీవిచ్యుతుడ్ని చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. నాదెండ్ల భాస్కరరావుతో చేతులు కలిపారు. దీంతో ఆయన కేబినెట్ లో మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అదే ఆమె పొలిటికల్ కెరీర్ ను మలుపు తిప్పింది. 1983లో సత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నన్నపనేని రాజకుమారి 1989లో వినుకొండ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ చీప్ విప్ గా, కేబినెట్ మంత్రి హోదాలో పనిచేశారు. దేశంలోనే తొలి ప్రభుత్వ చీఫ్ విప్ గా పేరు గడించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1994లో వినుకొండ నుంచే మరోసారి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అటు తరువాత టీడీపీతో అనుబంధం కొనసాగించారు. 1994 నుంచి 2004 వరకూ టీడీపీ అధికారంలో ఉన్నా.. తన కుల మార్కుతో టీడీపీతో గట్టి బంధమే వేసుకున్నారు. అప్పట్లో ఆమె వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో విమర్శలకు దారితీసింది. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు.
మరోసారి లాబీయింగ్..
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రాజకుమారి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. అదే 2014 ఎన్నికల్లో రాజకుమారి కుమార్తె డాక్టర్ సుధ వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థి పోటీచేసి ఓడిపోయారు. అయినా సరే రాజకుమారికి కీలకమైన నామినేట్ పోస్టు దక్కిందంటే ఆమె నెరిపే రాజకీయం అటువంటిది. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తరువాత మాత్రం ఆమె కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు హాజరైంది లేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి యాక్టవ్ కావాలని చూస్తున్నారు. తనకు కానీ.. తన కుమార్తెకు కానీ వినుకొండ టిక్కెట్ తెప్పించుకోవాలని లాబీయింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది సీనియర్లతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.

కుమార్తె కోసం ప్రతిభాభారతి..
కావాలి ప్రతిభాభారతి పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఏపీ తొలి మహిళా స్పీకర్ గా ఆమె గుర్తింపు సాధించారు. 1983లో టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎచ్చెర్ల నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభజనతో ఎచ్చెర్ల బీసీగా మారింది. బీసీ స్థానమైన రాజాం ఎస్సీలకు కేటాయించారు. దీంతో ప్రతిభాభారతి నియోజకవర్గం మారడం అనివార్యంగా మారింది. 2009లో రాజాం నుంచి పోటీచేసిన ప్రతిభాకు ఓటమి తప్పలేదు. 2014లో సైతం ఆమె నెగ్గలేదు. దీంతో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఆమెను తప్పించి కోండ్రు మురళీమోహన్ కు టిక్కెట్ ఇచ్చారు. అయితే ఈసారి రాజాం టిక్కెట్ తన కుమార్తె గ్రీష్మకు ఇవ్వాలని చంద్రబాబును కోరుతూ వస్తున్నారు. కానీ ఆయన మనసులో ఉన్న మాటను మాత్రం బయటపెట్టడం లేదు. మరోవైపు కోండ్రు మురళీమోహన్ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ తన కుమార్తెకు పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని ప్రతిభాభారతి తెగ ఆరాటపడుతున్నారు. మొత్తానికి ఈ తెలుగు వృద్ధ మహిళల ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరీ.