
BRS On Visakha Steel: ఏపీలో బీఆర్ఎస్ విస్తరించాలన్న ఏ ప్రయత్నమూ కేసీఆర్ కు కలిసి రావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూతో బీఆర్ఎస్ గ్రాండ్ ఎంట్రీకి కేసీఆర్ ప్లాన్ చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు బీజేపీని ఢీకొట్టడంతో పాటు పార్టీలో చేరికల సంఖ్య పెంచుకోవాలని భావించారు. అందుకే ఇలా విశాఖ స్టీల్ నుంచి బిడ్ ప్రకటన వచ్చిందో లేదో పావులు కదపడం ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ అయినతే నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆలోచనను మానుకోవాలని కోరారు. తాము సైతం బిడ్ లో పాల్గొంటున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పై సానుకూలత వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఏపీ తరుపున అభినందనలు వెల్లువెత్తాయి. అయితే ఇవి ఎన్నిరోజులో నిలవలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ ఎత్తుగడ తేలిపోయింది. బిడ్ లో పాల్గొనకపోవడంతో ముప్పేట దాడి ప్రారంభమైంది. ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరించాలన్న ప్రయత్నానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
ప్రారంభంలో హడావుడి..
కేసీఆర్ అండ్ కో ప్రకటనల తరువాత కేంద్ర ఉక్క సహాయ మంత్రి ప్లాంట్ ను సందర్శించారు. ఆ సమయంలో ఆయన పొడిపొడిగా ఆడిన మాటలతో కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గిందన్న సంకేతాలు వచ్చాయి. దీంతో కేసీఆర్ దెబ్బకు కేంద్రం అబ్బ అందని.. ఇక విశాఖలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గర్వంగా ప్రకటించారు.విశాఖ స్టీల్ బిడ్ లో తెలంగాణ సర్కారు పాల్లొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల విషయంలో పొరుగు రాష్ట్ర సీఎం స్పందించడాన్ని ఏపీ ప్రజలు స్వాగతించారు. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు బిడ్ లో పాల్గొనకపోయే సరికి కథ అడ్డం తిరిగింది. అది పొలిటికల్ స్టంట్ గానే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం పేరుతో ఏపీలో అడుగు పెట్టాలనుకున్న భారత రాష్ట్ర సమితి పరిస్థితులు అనుకూలించలేదు. స్టీల్ ప్లాంట్ కార్మికసంఘ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐకి బిడ్ ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీ బీఆర్ఎస్ నేతల నుంచి నోటిమాట రావడం లేదు.
పునరాలోచనలో జేడీ లక్ష్మీనారాయణ
విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూతో నేతల చేరికకు కేసీఆర్ ప్లాన్ రూపొందించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారిని రప్పించి ఏపీలో పార్టీని యాక్టివ్ చేయాలని కేసీఆర్ భావించారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చర్చలు జరిపారు. అయితే తెలంగాణ సర్కారు యూటర్న్ తో జేడీ లక్ష్మీనారాయణ పునరాలోచనలో పడ్డారు. అనవసరంగా బీఆర్ఎస్ వెంట నడిస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించారు. అయితే అనూహ్యంగా ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో చేతులు కలపడం మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేసీఆర్ కంటే పాలే నయమని జేడీ డిసైడయినట్టుందని సెటైర్లు వినిపిస్తున్నాయి. బిడ్ వేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించినప్పుడు.. కేంద్ర సహాయ మంత్రి ప్రకటన తరువాత కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం వెనుక కేసీఆర్ కృషిని కొనియాడుతూ జేడీ అభినందనలు తెలిపారు. దీంతో త్వరలో జేడీ బీఆర్ఎస్ లో చేరిక లాంఛనమేని అంతా భావించారు. కానీ ఇప్పుడు జేడీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

ఇప్పట్లో లేనట్టే..
బీఆర్ఎస్ విస్తరణ తరువాత కేసీఆర్ ఏపీపై ఫోకస్ పెడతారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం మహారాష్ట్రపైనే ఎక్కవగా దృష్టిపెట్టారు. వరుసగా మూడు సభలు సైతం నిర్వహించారు. ఒడిశా, ఏపీలకు ఇన్ చార్జిలను నిర్వహించిన కార్యకలాపాలేవీ స్టార్ట్ చేయలేదు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతున్నా కాన్సంట్రేట్ చేయడం లేదు. ఏపీలో అనవసరంగా విశాఖ స్టీల్ ఇష్యూలో చేతులు పెట్టి మరింత అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఏపీ ప్రజల్లో లేనిపోని భ్రమలు కల్పించి వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. అప్పటి వరకూ ఏపీ ప్రజలుకు తనపై ఉన్న కోపాన్ని రెట్టింపు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ వైపు చూస్తున్న నేతలు సైతం వెనుకడుగు వేస్తున్నారు. మొత్తానికైతే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ అనేది అంత ఈజీగా జరగదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.