
Malli Pelli Teaser Review: నటుడు నరేష్ మరో సంచలనానికి తెర లేపాడు. ‘మళ్ళీ పెళ్లి’ మూవీ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటే… కాదని టీజర్ తో చెప్పాడు. మళ్ళీ పెళ్లి టీజర్ టాలీవుడ్ లో అతి పెద్ద చర్చకు దారితీసింది. కారణం ఇది నరేష్ బయోపిక్. నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి ల ఎపిసోడ్ ఆధారంగా తెరకెక్కించారు. టీజర్లో ఇటీవల జరిగిన సంఘటనలను చూపించారు. నిమిషానికి పైగా ఉన్న టీజర్ నరేష్ జీవితంలోని కాంట్రవర్సీలతో సాగింది.
గత ఏడాది పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ మహాబలేశ్వరంలో కలిసి పూజలు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నరేష్ నాలుగో వివాహం చేసుకున్నాడని కథనాలు వెలువడ్డాయి. నరేష్ ఈ వార్తపై స్పష్టత ఇచ్చారు. మేమిద్దరం ఒకరినొకరం నమ్మాము. కలిసి జీవిస్తున్నాము. వివాహం అయితే చేసుకోలేదు. భవిష్యత్ లో చేసుకుంటానేమో తెలియదు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు.
ఈ ప్రకటన తర్వాత నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగింది. ఆమె నరేష్ మీద పలు ఆరోపణలు చేశారు. మైసూర్ హోటల్ లో నరేష్-రమ్య రఘుపతి ఉన్నారన్న విషయం తెలుసుకొని గది ముందు బైఠాయించింది. పోలీసులు రంగంలోకి దిగారు. నరేష్-పవిత్రలను అక్కడ నుండి పంపేశారు. రమ్య చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. తర్వాత మీడియా ముఖంగా నరేష్, రమ్య రఘుపతి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.

మళ్ళీ పెళ్లి టీజర్లో ఇవే అంశాలు చూపించారు. కాబట్టి మళ్ళీ పెళ్లి సినిమా.. నరేష్, పవిత్ర లోకేష్ తమ నిజ జీవితాన్ని సినిమాగా తీసి స్వయంగా నటించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే టీజర్లో భార్యను మంచిగా చూపించాడు. తన క్యారెక్టర్ తో పాటు పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ని తప్పుగా ప్రొజెక్టు చేశారు. నరేష్-పవిత్ర-రమ్య రఘుపతి ట్రయాంగిల్ డ్రామా మీద జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉన్న నేపథ్యంలో సినిమాగా తీసి క్యాష్ చేసుకోవాలని నరేష్ భావిస్తున్నారనిపిస్తుంది. అదే విధంగా తనపై వస్తున్న ఆరోపణలకు, పవిత్ర లోకేష్ తో తన సంబంధం, రమ్య రఘుపతితో గొడవల గురించి సినిమాగా చెప్పాలని కోరుకుంటూ ఉండొచ్చు.
మళ్ళీ పెళ్లి చిత్రానికి నరేష్ నిర్మాతగా ఉన్నారు. ఒకప్పటి నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించారు. రమ్య రఘుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్ నటించారు. త్వరలో విడుదల కానుంది.
