Allu Arjun arrested : రేవతి చనిపోయిన మూడు రోజుల తర్వాత పుష్ప సినిమా కథానాయకుడు అల్లు అర్జున్ ఒక వీడియో విడుదల చేశారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 25 లక్షలు పరిహారం ఇస్తానని ప్రకటించారు. రేవతి కుమారుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. అతడి వైద్య ఖర్చులు మొత్తం తమ భరిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అయింది. రేవతి చనిపోవడం.. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉండడంతో సభ్య సమాజం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో చిక్కడపల్లి పోలీసులకు రేవతి కుటుంబ సభ్యులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా అనేక కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై 105, 118 (1) రెడ్ విత్ 3/5 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. ఈ కేసులు మొత్తం స్ట్రాంగ్ గా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 105 సెక్షన్ అనేది నాన్ బేలబుల్ కేస్ అని.. దీనివల్ల 10 సంవత్సరాలపాటు సదరు వ్యక్తికి శిక్ష పడుతుందని వివరిస్తున్నారు. బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద ఏడాది నుంచి పది సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. రేవతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు.. ఈ ఘటనపై తనకు ఎటువంటి సంబంధం లేదని అల్లు అర్జున్ ఇప్పటికే ఒక వీడియోలో స్పష్టం చేశారు..”నేను థియేటర్ కు వస్తున్న విషయం యాజమాన్యానికి చెప్పాను. పోలీసులకు వివరించానని” అల్లు అర్జున్ పేర్కొన్నారు.
అండగా ఉంటానని హామీ
సంధ్య థియేటర్ ఘటనలో దుర్మరణం చెందిన మహిళ కుటుంబానికి తాను అండగా ఉంటానని అల్లు అర్జున్ ఇటీవల వెల్లడించారు. చిత్ర బంధం నుంచి 25 లక్షల పరిహారం అందిస్తానని వెల్లడించారు. రేవతి కుమారుడికి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తానని అల్లు అర్జున్ వెల్లడించారు. రేవతి భర్త ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి అతడిని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా అభిమానులు చేరుకోవడంతో వారిని చెదరగొట్టడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పోలీసులు రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు. అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వైద్య పరీక్ష నిమిత్తం అల్లు అర్జున్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకుడు కేటీఆర్ ట్విట్టర్ వేదిక స్పందించారు. ప్రభుత్వం అల్లు అర్జున్ ను అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.