కరోనా మహమ్మారి ఈ శతాబ్దపు అతిపెద్ద ఉత్పాతంగా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిరకాల వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన వైరస్ మహమ్మారి మనదేశంలోనూ తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. 2020 ఫిబ్రవరి తర్వాత దేశంలోకి ప్రవేశించిన వైరస్ క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. కేంద్రం అప్రమత్తమై మార్చి నుంచి కొవిడ్ కట్టడి కోసం లాక్డౌన్ అమలుచేసింది. లాక్డౌన్ వల్ల అన్ని రంగాల మాదిరిగానే తెలుగు చిత్రసీమ దారుణంగా దెబ్బతింది. ఓ అంచనా ప్రకారం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ మిగతా ప్రాంతీయ చిత్రాలను కలుపుకుంటే దాదాపు జులై నాటికే 5 వేల కోట్ల రూపాయల వ్యాపారం ఆగిపోయి చిత్రసీమ మీద ఆధారపడ్డ ప్రతిఒక్కరూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో పాటు సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో OTT ఇటీవల బహుళప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకోకపోవడం..ఒకవేళ ఆంక్షలతో ఓపెనైనా…కరోనా భయంతో ప్రేక్షకులు మునుపటిలా వస్తారా అనే సందేహాలు సినీ పరిశ్రమ పెద్దలను వెంటాడుతున్నాయి. అందుకే చిన్న నిర్మాతలు సినిమా నిర్మాణం కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలభారం భరించలేక OTT వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఆ కోవలోనే ‘‘అసలేం జరిగింది, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’’ తదితర తెలుగు చిత్రాలను OTTలోనే విడుదల చేశారు. ఇంతకీ OTT అంటే ఓవర్ది టాప్. టీవీ, సినిమాకు మించి హైస్పీడ్‌తో ఇంటర్నెట్ ఆధారంగా నడిచే సమాంతర వ్యవస్థ. మొదట్లో నిర్మాతలు తపటటాయించినా…క్రమంగా OTTల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం OTT ప్లాట్‌ఫామ్స్‌గా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా ఉన్నాయి.
Also Read: 2 లక్షలు కూడా ఎక్కువేనట.. పాపం పవన్ హీరోయిన్ !
*ఓటీటీలతో ఎవరికి మేలు!
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చిన్న నిర్మాతలు ఆర్థిక భారం భరించలేక OTTల వైపు మొగ్గుచూపుతున్నా పెద్ద నిర్మాతలు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. సినిమా నిర్మాణంపై తాము పెట్టిన ఖర్చు OTTల ద్వారా రాదని వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఆ కోవలోనే జూనియర్ NTR,రామ్‌చరణ్ ప్రధాన తారగణంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR, కొరటాల శివదర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రాలు థియేటర్లలోనే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుగుసినీవర్గాల సమాచారం. భారీ హంగులతో సిద్ధమవుతున్న చిత్రాలు థియేటర్లలోనైతేనే ప్రేక్షకులు ఆ అనుభూతిని ఆస్వాదిస్తారనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు.
ఐతే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయమేమిటంటే చిన్న చిత్రాలనూ OTT నిర్వాహకులు చాలా తక్కువరేటుకే అడుగుతున్నారని సమాచారం. గత్యంతరం లేకనే వచ్చినకాడికి చాల్లే ఇక వడ్డీల భార మోయలేమనే ధోరణిలో చిన్న నిర్మాతలు OTT ప్లాట్‌ఫామ్స్‌పై విడుదల చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రేక్షకులు అరచేతిలో సినిమాలు చూడటాన్ని ప్రస్తుతానికి బాగానే ఆస్వాదిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక… ఆ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారా లేదా థియేటర్ల వైపే పరిగెడతారా అనేది ప్రస్తుతం ఉత్కంఠ కలిగిస్తోంది.
· దిల్ రాజుకు కలిసొచ్చిన ఓటీటీ
నాని, సుధీర్ బాబు, నివేదాథామస్, అదితిరావు హైదరీ సూపర్ క్యాస్టింగ్ తో వైవిధ్య దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో రూపొందింది. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనే అంచనాలతో తెరకెక్కిన V సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. తీరా రిలీజ్ డేట్ వచ్చేసరికి కరోనా, తదనంతరం లాక్డౌన్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ నాని సినిమాను ఏకంగా అనూహ్యరీతిలో 42 కోట్లు పెట్టి కొనేసింది. దిల్‌రాజు బృందం 30 కోట్లతో తెరకెక్కించగా శాటిలైట్ హక్కుల ద్వారా మరో పది 15 కోట్లు దక్కుతాయని భావిస్తున్నారు. అన్ని బేరాలు కుదిరి వర్కవుటైనందున చివరకు సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ఏ స్థాయి సినిమానైనా మేం కొంటాం అంటూ అంతేకాదు ఈ సినిమాలు కొనే పోటీలో మేమంటే మేమే… ఇంకెవరూ పోటీలేరనే సందేశం ఇవ్వాలనే అమెజాన్ ప్రైమ్ అంత భారీ ధర ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇలా అన్ని సినిమాలకు ఇంత ధర వస్తుందని అనుకోవడం పూర్తి అపోహలే.
Also Read: మాకు కరోనా రాలేదు.. దయచేసి వదంతులను నమ్మవద్దు !
· ఇక వరుస కట్టడమేనా…
బాహుబలి-2 తర్వాత అనుష్క నటించిన చిత్రం నిశ్సబ్దం కూడా దాదాపుగా OTTలోనే విడుదలయ్యేందుకు ఒప్పందాలు అయిపోయాయి. ఇప్పటికే బాలీవుడ్లో గుంజన్ సక్సేనా వంటి సినిమాల్ని నేరుగా ఓటీటీ వేదికగానే రిలీజ్ చేస్తున్నారు. తమిళ నిర్మాతల ఆలోచనసరళి మారిపోయింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సూరారై పొత్రు సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. కొందరు దర్శకులు, నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినా…ఖాతరు చేయకుండా ముందుకే వెళ్లారు. అమెజాన్ గనుక V స్థాయిలో మంచి రేట్ ఆఫర్ చేస్తే మన తెలుగు సినిమాలూ ప్రైమ్‌లో వరుస గడతాయి. ఆ రేంజ్లో హాట్‌స్టార్, ఆహా ఎలాగూ ఇవ్వలేవు. ఇక నెట్‌ఫ్లిక్స్ సొంత సినిమాలకు తప్ప వేటికీ ప్రాధాన్యం ఇవ్వదు. అసలు తెలుగు సినిమాలు దానికి ఆనవు కూడా!! ఇంకా కొందరు బడా నిర్మాతలు మాత్రం కమర్షియల్ సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తే అంత మేలు కలగదు. చిత్రానికి సంబంధించిన కాపీరైట్స్ మొత్తం డిజిటల్ తెర వారికే సొంతవుతాయని చెబుతున్నారు. దర్శకులు , నిర్మాతలు సొంతంగా నిర్మించుకోవడానికే ఈ వేదికలు ఉపయోగపడతాయనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. OTTల్లో సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్ల కంటే ఎక్కువగానే పైరసీ బారిన పడతామనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మొత్తంగా చూస్తే ఏదేమైనా… ఓటీటీ నాణానికి రెండు వైపులా అన్న చందంగా ఉంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో మార్పును ఎవరైనా ఆహ్వానించాల్సిందే. ఐతే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందేనే లెక్కల్లో తెలుగు సినీ బడా నిర్మాతలు, దర్శకదిగ్గజాలు ఉన్నారు. ఇప్పటికైతే చిన్న చిత్రాలు అనివార్యంగా ఓటీటీ, ఏటీటీలో రిలీజ్ చేసేందుకే రెడీ అయిపోతున్నారు. పెద్ద నిర్మాతలు మాత్రం ఇంకా వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. అంతిమంగా తెలుగు చిత్రసీమను ఓటీటీల వ్యవస్థ ఎటువైపు నడిపిస్తుందో వేచిచూద్దాం!.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Theaters otts which is better for the movie industry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com