Bogatha Waterfalls : ఆకాశం నుంచి గంగా ప్రవాహం కిందికి దూకినట్టు.. ఆ జలపాతం ప్రవహిస్తోంది. ఆ నీటి జడి ఆహ్లాదంగా కనిపిస్తోంది. కనుచూపుమేర మొత్తం నీరే ఉండడంతో కన్నులకు పండుగలాగా ఉంది. ఇదంతా ఎక్కడో విదేశాలలో లేదు.. ఇతర రాష్ట్రాలలో అంతకంటే లేదు.. తెలంగాణలోనే ఉంది.
కాస్త ఆలస్యంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. దీనికి తోడు ఎగువన ఉన్న చత్తీస్గడ్ ప్రాంతంలో కూడా జోరుగా వానలు పడుతున్నాయి.ఈ నేపథ్యంలో వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో వాజేడు మండలంలోని బోగత జలపాతం పరవళ్ళు తొక్కుతోంది.
ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో బోగత జలపాతం ఉంది. ఇది చత్తీస్గడ్ రాష్ట్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు నీరు పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. బొగత జలపాతం గోదావరికి ఉపనది అయిన చీకుపల్లి వాగు మీద ఉంటుంది. ఇక్కడ జూలై నుంచి నవంబర్ వరకు జలపాతం వద్ద దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆ నీటి ప్రవాహం ప్రకృతి రమణీయతకు సరికొత్త అర్ధాన్ని చెబుతూ ఉంటుంది.
అంత ఎత్తున ఉన్న కొండల నుంచి నీళ్లు కిందికి జాలు వారుతూ ఉంటే.. చూసేందుకు అదృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. చుట్టూ దట్టమైన అడవులు ఉండడంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతి లభిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో అటవీ ప్రాంతం దట్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జలపాతం కింద ఈత కొలనులు ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ కొండల మీదికి ఎక్కడానికి ట్రెక్కింగ్ అవకాశం ఉంటుంది. ఫోటోగ్రఫీ కూడా అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్ నగరం నుంచి బోగత వెళ్లాలంటే దాదాపు 329 కిలోమీటర్లు ప్రయాణించాలి. వరంగల్ నుంచి ఏటూరు నాగరం మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి అయితే 140 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు . భద్రాచలం నుంచి 120 కిలోమీటర్ల ప్రయాణించి చేరుకోవచ్చు. ఈ జలపాతం వరకు రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బోగత జలపాతం పరవళ్ళు తొక్కుతోంది.. అయితే ప్రవాహం ప్రమాదకరమైన స్థితిలో ఉండడంతో.. ప్రస్తుతానికి ఇక్కడకి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రవాహస్థాయి తగ్గిన తర్వాత రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉంది.