KTR: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏసీబీ కోర్టు ఆశ్రయించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఉన్నట్టుండి ఏసీబీ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాలలో చర్చ మొదలైంది. ఇంతకీ ఏం జరిగింది.. కేటీఆర్ ఆ పని ఎందుకు చేశారంటే..
కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. నాడు నిర్వహించిన ఈ రేస్ లో నిధుల మళ్లింపు చోటుచేసుకుందని అభియోగాలు నమోదయ్యాయి. వ్యవహారంలో కేటీఆర్ ను కార్నర్ చేయడానికి రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో తనను తాను కాపాడుకోవడానికి కేటీఆర్ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు ఏసీబీ కోర్టు నమోదు చేసిన చార్జ్ షీట్ లో తన పేరు తొలగించాలని.. కేటీఆర్ హైదరాబాదులోని నాంపల్లి లో ప్రత్యేక ఏసీబీ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు.
దాదాపు 55 కోట్ల హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థకు.. నిబంధనలు పాటించకుండా బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగాల పై దర్యాప్తు సంస్థ చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిని కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ కేసును నవంబర్ నెల కు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
వాస్తవానికి కేటీఆర్ ఇప్పటికే ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని హైకోర్టుతో పాటు.. సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. రెండు చోట్ల కూడా ఆయన కు రిక్తహస్తం ఎదురైంది. అయితే రెండుసార్లు కూడా చుక్కెదురు కావడంతో మళ్ళీ ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించడం ఎంతవరకు సమంజసం అవుతుందనేది చర్చ మొదలైంది. మన దేశ న్యాయ వ్యవస్థలో ఎఫ్ఐఆర్ కొట్టివేయడానికి క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. అయితే దాని పరిధి వేరు. ఒకవేళ చార్జ్ షీట్ దాఖలు అయిన తర్వాత డిశ్చార్జి పిటిషన్ వేసుకోవచ్చు. దీని పరిధి కూడా వేరు.
గతంలో ఏసీబీ నమోదు చేసిన ప్రాథమిక ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టు దాగా వెళ్లారు. అయితే నాడు ఈ కేసు ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉందని.. నేరం జరిగిందా లేదా అని తేల్చడానికి దర్యాప్తు అవసరమని.. దానిని ఆపలేమని సుప్రీంకోర్టు కేటీఆర్ కు సూచించింది. హైకోర్టుకు వెళ్లినప్పటికీ కూడా ఆయనకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో రెండుచోట్ల పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. ఇప్పుడు ఏసీబీ విచారణ పూర్తి చేసి.. తన తుది చార్జ్ షీట్ కోర్టు ముందు ఉంచింది. ఈ ప్రకారం చట్టపరంగా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ట్రయల్ మొదలు కాకముందే డిశ్చార్జ్ పిటిషన్ హక్కు ఉంటుందని.. న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కేటీఆర్ పేర్కొనే విషయాలు.. సాంకేతికపరమైన ఆధారాలు.. ఇతర అంశాల చుట్టూ వాదనలు తిరిగే అవకాశం ఉంది. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. అది విధానపరమైన నిర్ణయం. అది వ్యక్తిగతమైన నిర్ణయం కాదు. అందులో అవినీతి లేదు. క్విడ్ ప్రో కో అసలు లేదని కేటీఆర్ తరఫున న్యాయవాదులు వాదించే అవకాశం ఉంది. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు.. తనను ఎందుకు విచారిస్తారని అని కేటీఆర్ కోర్టులో వాదించవచ్చు.. వాస్తవానికి న్యాయస్థానం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మీద అభియోగాలు నమోదు చేయడం కంటే ముందే.. కొన్ని పత్రాలు ఆధారంగా కేసు నుంచి విముక్తి చేయాలి అని కోరుకోవడం ఒక రకమైన లీగల్ స్టెప్.
ఈ వ్యవహారంలో కేటీఆర్ కు అంత సులభంగా ఉపశమనం లభించే అవకాశం ఉండకపోవచ్చు. పిటిషన్ డిశ్చార్జ్ దశలో ఉన్నప్పుడు న్యాయస్థానం సాక్షాల లోతుల్లోకి వెళ్లి.. విచారించదు. ప్రైమరీ లెవెల్ లో అనుమానం లేదా ఆధారాలు గనక ఉంటే కేసును ప్రయోదశి పంపించేందుకు కోర్టు సుముఖత వ్యక్తం చేస్తుంది. గవర్నర్ విచారణకు అనుమతి ఇవ్వడం.. లావాదేవీలకు సంబంధించిన రికార్డులు ఇప్పటికే చార్జిషీట్లో నమోదు చేసి ఉండడం.. ఈ కేసులో ఏసీబీకి అదనపు బలాలుగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో.. తదుపరి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.