https://oktelugu.com/

Phone Tapped : అలాంటి సంకేతాలు వినిపిస్తున్నాయా? మీ ఫోన్ ట్యాప్ కు గురైనట్టే..

కొన్నిసార్లు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాల్స్ అర్ధంతరంగా ఆగిపోవడం.. లేదా మన మాట మనకే వినిపించడం వంటివి నిఘా కు సంకేతాలు కావచ్చు. ఫోన్ వాడనప్పుడు స్క్రీన్ ఆన్ కావడం, లేదా ఆఫ్ కావడం.. రకరకాల చెప్పులు చేయడం వంటివి గమనిస్తే కచ్చితంగా అనుమానించాలి.

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2024 8:51 pm
    phone tapped

    phone tapped

    Follow us on

    phone tapped : ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ప్రతి చిన్న విషయానికి ఫోన్ మీద ఆధారపడుతున్నాం. ఫోన్ తోనే సహవాసం సాగిస్తున్నాం. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రత అనేది అత్యంత కీలకం. పైగా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో అధునాతన నిఘా వ్యవస్థలు తెరపైకి వచ్చాయి. ఇవి రాను రాను మరింత అభివృద్ధి చెందుతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే చీమ చిటుక్కుమనకుండానే .. మొత్తం తెలుసుకునే వ్యవస్థలు మరి కొద్ది రోజుల్లో మన కళ్ళ ముందు ఆవిష్కృతం కానున్నాయి. ఇలాంటి సమయంలో మన నిత్యజీవితంలో విడదీయలేని ఒక భాగంగా మారిపోయిన ఫోన్ మీద నిఘా పెట్టడం, ట్యాప్ చేయడం వంటి విషయాలను ఇటీవల తరచుగా వింటున్నాం. ఇంతకీ ఫోన్ ట్యాప్ అంటే.. “టెలిఫోన్ లైన్ లు లేదా వైర్ లెస్ నెట్వర్క్ మీద ప్రసారమయ్యే సంకేతాలను అడ్డగించి.. ఫోన్లో జరిపే సంప్రదింపులను లేదా సంభాషణలను దొంగ చాటుగా వినడం.. మాటలను రికార్డ్ చేయడం”.

    వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. పొరపాటున ఫోన్ ట్యాపింగ్ ద్వారా మన వివరాలు ఇతరులకు చేరితే.. అది ఎంతటి దారుణానికి దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరి ఇలాంటి సమయంలో మన ఫోన్ ట్యాపింగ్ కు గురైందో ఎలా తెలుసుకోవాలి? వాస్తవానికి ఇది కష్టమైన పనే అయినప్పటికీ.. అధునాతన నిఘా పద్ధతుల ద్వారా..ఫోన్ ట్యాపింగ్ ను మనం తెలుసుకోవచ్చు.

    ఆ శబ్దాలు వచ్చినప్పుడు..

    సాధారణంగా మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు క్లిక్ అనే ప్రత్యేక చప్పుడు లేదా ప్రతిధ్వని వినిపించినప్పుడు, ఉన్నట్టుండి మాటలు ఆగిపోయినప్పుడు.. ఏవో నిఘా పరికరాలు మన సంభాషణలను అడ్డుకున్నాయని చెప్పడానికి సంకేతాలు.

    అలా అకస్మాత్తుగా జరిగితే..

    మన ఫోన్ వాడనప్పుడు కూడా బ్యాటరీ త్వరగా నిండుకుంటే.. ఊరికే వేడెక్కడం గమనిస్తే కచ్చితంగా సందేహించాల్సిందే. మన ఫోన్ లో నిఘా సాఫ్ట్ వేర్ రన్ అవుతున్నప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి..

    డాటా త్వరగా పూర్తవడం..

    మనం వాడకుండానే డాటా వెంటనే పూర్తవుతుంటే కచ్చితంగా అనుమానించాలి. అనధికార అప్లికేషన్లు మనకు తెలియకుండానే మన డాటా ను వాడుకుంటున్నాయని చెప్పడానికి ఇది ఒక సూచన..

    ఆలస్యంగా అలా జరిగితే..

    నిఘా సాప్ట్ వేర్ వెనకాల రన్ అవుతున్నప్పుడు ఫోన్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అలాంటప్పుడు మనం వెంటనే అప్రమత్తం కావాలి.

    అవి వచ్చినప్పుడు..

    అసాధారణ సందేశాలు, హెచ్చరికలు, ముందస్తు నోటిఫికేషన్లు వస్తే అనుమానించాలి. అవి ట్యాపింగ్ కు చిహ్నాలు. ముఖ్యంగా ర్యాండం అక్షరాలు, చిహ్నాలతో కూడిన సందేశాలు వస్తే..ఫోన్ ను ఇతరులెవరో పర్యవేక్షిస్తున్నారని సందేహించాలి.

    వాటంతట అవి ఆగిపోతే..

    కొన్నిసార్లు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాల్స్ అర్ధంతరంగా ఆగిపోవడం.. లేదా మన మాట మనకే వినిపించడం వంటివి నిఘా కు సంకేతాలు కావచ్చు. ఫోన్ వాడనప్పుడు స్క్రీన్ ఆన్ కావడం, లేదా ఆఫ్ కావడం.. రకరకాల చెప్పులు చేయడం వంటివి గమనిస్తే కచ్చితంగా అనుమానించాలి.