Sarpanch Elections In Telangana: సర్పంచ్ ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం మూడు దశల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నామినేషన్ల పర్వం, ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో బేర సారాలు, ఇతర వ్యవహారాలు దర్జాగా నడుస్తుంటాయి. కుల సమీకరణాలు, ఇతర లెక్కలు వేరే విధంగా ఉంటాయి. అందువల్లే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో సందడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పదనిసలు చోటుచేసుకుంటున్నాయి. కాకపోతే ఇటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు చోటు చేసుకోలేదు.
సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట – భూంపల్లి గ్రామం జనరల్ మహిళ కు రిజర్వ్ అయింది. ఈ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. గత నెల 30న మొదటి భార్యతో నామినేషన్ దాఖలు చేయించాడు. ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇంతలోనే అతడికి ఒక అనుమానం వచ్చింది. నామినేషన్ భర్తలలో ఏవైనా తప్పులు ఉంటే.. స్క్రూటినీ లో ఎక్కడైనా తొలగిస్తారేమోనని భయం అతడులో కలిగింది. దీంతో మరో మాటకు తాగులేకుండా కీలక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే రెండో భార్యతో నామినేషన్ దాఖలు చేయించాడు.
ఈ గ్రామంలో నామినేషన్లు దాఖలు చేసే సమయం వరకు ఆ వ్యక్తికి సంబంధించిన ఇద్దరు భార్యలు మాత్రమే పోటీలో ఉన్నారు. ఈ ప్రకారం ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే.. మరొకరికి సర్పంచ్ పదవి లభిస్తుంది.. అయితే ఇద్దరు భార్యలతో నామినేషన్ దాఖలు చేయించాడు కాబట్టి.. ఎవరితో ఉపసంహరించుకుంటాడు.. అనేది ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ కావాలని ఇద్దరు భార్యలు ఆసక్తితో ఉండడంతో ఎవరి వైపు మొగ్గు చూపించాలి? ఎవరితో నామినేషన్ ఉపసంహరించుకోవాలి? అనే విషయంలో అతడు తీవ్రమైన మదనంలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఇటువంటి సంఘటన ఎక్కడా చోటు చేసుకోలేదు.
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో బద్ధ శత్రువులుగా ఉన్న పార్టీలు సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని గ్రామాలలో ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టాయి. రాజకీయంగా ఇది విచిత్రమైనదైనప్పటికీ.. స్థానిక ఎన్నికల్లో ఇటువంటి పరిణామాలు సర్వసాధారణం. అయితే ఇద్దరు భార్యలను సర్పంచ్ పదవికి పోటీలో ఉంచడం మాత్రం ఇదే తొలిసారి. అది కూడా పోటీలో వారిద్దరు మాత్రమే ఉండడం.. ఎవరో ఒకరు ఉపసంహరించుకుంటేనే సర్పంచి పదవి దక్కడం ఇదే ప్రథమం.