https://oktelugu.com/

DC vs SRH : ఏంటా కొట్టుడు.. మనిషివా.. పరుగుల యంత్రానివా? ట్రావిస్ హెడ్ భీకర సెంచరీ జస్ట్ మిస్

అతడు ఔటైన మరుసటి ఓవర్ లో తొలి బంతికే క్లాసెన్ అవుట్ అయ్యాడు. అతడు 8 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ధాటిగా ఆడే క్రమంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. క్రీజ్ లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి(8*), షాబాజ్ అహ్మద్ (4*) ఉన్నారు

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2024 8:42 pm
    Travis Head Century Miss

    Travis Head Century Miss

    Follow us on

    DC vs SRH : అయితే ఫోర్.. లేకుంటే సిక్స్.. బౌలర్ ఎవరనేది కాదు. ఎంతటి తోపు అనేది కాదు.. కొట్టుడు కొడితే బౌండరీ దాటుతోంది. లేకుంటే స్టాండ్స్ లో ఎగిరి పడుతోంది. బంతిమీద ఏదో దీర్ఘకాలం వైరం ఉన్నట్టు.. బౌలర్ల పై కోపం ఉన్నట్టు.. కసితీరా కొడుతున్నాడు. ఫలితంగా రాకెట్ కాదు.. సూపర్ సానిక్ విమానం అంతకంటే కాదు.. ఇటీవల చంద్రయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన రాకెట్ వేగంతో దూసుకెళ్లింది హైదరాబాద్ జట్టు స్కోర్. ఇంతటి స్కోర్ కు కారణం.. వేరెవరో ప్రత్యేకంగా చెప్పాలా… అతడే హెడ్.. అలియాస్ ట్రావిస్ హెడ్.


    వాస్తవానికి ఈ మైదానంపై మహా అయితే 180 కంటే మించి స్కోర్ సాధించలేరు. అందువల్లే అనుకుంటా ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలవగానే మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అది ఎంత తప్పో హెడ్ వీర విహారం చేస్తుంటే అతడికి తెలిసి వచ్చింది. ఖలీల్ అహ్మద్, కులదీప్ యాదవ్, నోర్ట్జీ, లలిత్ యాదవ్, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్.. ఇలా ఆరుగురు బౌలర్ల బౌలింగ్ ను హెడ్ ఊచకోత కోశాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా ఫోర్లు.. షూ లేస్ కట్టుకున్నంత సులభంగా సిక్సర్లు కొట్టాడు. అతడి ధాటికి హైదరాబాద్ స్కోరు తారాజువ్వలాగా ఎగిసింది.

    వాస్తవానికి హెడ్ ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో హెడ్ వీర విహారం చేశాడు. వారి సొంత మైదానంలోనే భీకరమైన సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలోనే ఏ జట్టూ చేయనంత స్కోరును హైదరాబాద్ (287) పేరుమీద లిఖించాడు. అతడు కూడా 102 పరుగులు చేశాడు. ఆ సెంచరీని మర్చిపోకముందే.. శనివారం రాత్రి ఢిల్లీలో అంతకుమించి అనే స్థాయిలో పరుగుల వరద పాలించాడు. బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 49 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలి వికెట్ కు 38 బంతుల్లో 131 రన్స్ పార్ట్ నర్ షిప్ ఏర్పాటు చేశారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 46 పరుగులు చేశాడు. హెడ్ 32 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేశాడు. కేవలం 6.2 ఓవర్లలోనే 131 రన్స్ భాగస్వామ్యాన్ని హెడ్, అభిషేక్ శర్మ నెలకొల్పారు.

    అక్షర్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుట్ కావడంతో 131 పరుగుల వద్ద హైదరాబాద్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ అవుట్ అయిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన మార్క్రం ఒక పరుగు చేసి కులదీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 133 పరుగుల వద్ద మార్క్రం ఔట్ అయ్యాడు. 89 పరుగులు చేసిన హెడ్ కులదీప్ యాదవ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అప్పటికి హైదరాబాద్ జట్టు 8 ఓవర్లకు 156 పరుగులు చేసింది.. అతడు ఔటైన మరుసటి ఓవర్ లో తొలి బంతికే క్లాసెన్ అవుట్ అయ్యాడు. అతడు 8 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ధాటిగా ఆడే క్రమంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. క్రీజ్ లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి(8*), షాబాజ్ అహ్మద్ (4*) ఉన్నారు.