గత రెండురోజుల్లో బ్యాంకులు చెత్త, మురికితో దర్శనం ఇస్తున్న వార్తలు పత్రికల్లో, చానళ్లలో చూసాం. కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ పధకాల ప్రకారం మునిసిపల్ సిబ్బందికి ఋణం మంజూరు చేయలేదని మునిసిపల్ సిబ్బంది వాళ్ళు సేకరించిన చెత్త, చెదారాన్ని బ్యాంకుల వాకిట ముందు పడేశారు. భరించరాని దుర్గంధం వెదజల్లటంతో పాటు డిపాజిట్ దార్లు బ్యాంకుల లోపలికిరావటానికి లేకుండా చేశారు. దురదృష్టవశాత్తు ఇది ప్రభుత్వానికి పెద్ద విశేషంగా అనిపించలేదు. ఎందుకంటే దీన్ని పరోక్షంగా ప్రోత్సహించింది ప్రభుత్వమే కాబట్టి. లేదంటే ఇప్పటికే ఈ దుండగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని వుండేవారు. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారని లోలోపల మురిసిపోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వంలో వుండేవారు ఎంత సంయమనం పాటించాలి, ఎంత హుందాగా వుండాలి? బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే ఇలా బెదిరిస్తారా? అదీ కరోనా మహమ్మారి నేపధ్యంలో. అంటే అటు బ్యాంకు సిబ్బంది, ఇటు బ్యాంకు ఖాతాదారులు కరోనా సోకాలని కోరుకుంటున్నారా? స్వచ్చ భారత్ పాటించాల్సిన మునిసిపల్ సిబ్బంది మురికి భారత్, మకిలి భారత్ ని పాటిస్తున్నారా? భాధ్యతాయుత ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? బ్యాంకులపై ప్రభుత్వ జులుం ఏమిటి? ఇంకో చోట జాయింట్ కలెక్టర్ స్వయంగా బ్యాంకుల్లో కూర్చొని బెదిరించట మేమిటి? అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా? పోలీసులు ఏం చేస్తున్నారు? ఎంతమంది దుండగులను అరెస్టు చేశారు? ప్రతినిధి సంఘాలు ఏం చేస్తున్నాయి? ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారా? వినటానికే దారుణంగా వుంది.
బ్యాంకులు ఈ రాజకీయనాయకుల జాగీరా?
ప్రభుత్వ బ్యాంకులు అనగానే అదేదో వీళ్ళ స్వంత జాగీరులాగా ప్రవర్తించటం పరిపాటయ్యింది. ఇది మొదట్నుంచీ వుంది. ఒకనాడు జనార్ధన్ పూజారి రుణ మేళాల పేరుతో స్టేజి మీదకు పిలిచి బ్యాంకు అధికారుల్ని మందలించటం అందరికీ తెలిసిందే. మన వుమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఖమ్మంలో అప్పట్లో ఇటువంటి సంఘటనే జరిగింది. తర్వాత విజయనగరంలో కలెక్టర్ జిల్లా బ్యాంకు అధికారుల సమావేశంలో బెదిరించటం జరిగింది. వెంటనే రుణ వితరణని ఆపేస్తున్నామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. తర్వాత ప్రభుత్వమూ, కలెక్టర్ దిగిరావటం జరిగింది. ఇవి గత స్మృతులు. ఇవి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే ఉద్యోగ ప్రతినిధులు నిరంతరం జాగరూకతతో ఉండక తప్పదు. లేకపోతే ఈ రాజకీయనాయకులు బ్యాంకుల నెత్తిన కూర్చోవటం ఖాయం. వాటితో పోల్చినప్పుడు ఇప్పుడు జరిగింది ఇంకా దారుణ సంఘటన.
అసలు బ్యాంకులు ఏమైనా ప్రభుత్వ శాఖలా? చాలామందికి అటువంటి అభిప్రాయమే ఇప్పటికీ వుంది. ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేసినట్లు, బ్యాంకుల ముందు కూడా నిరసనలు చేయటం పరిపాటయ్యింది. బ్యాంకుల్లో మెజారిటీ వాటా ప్రభుత్వానికి వుండొచ్చు. అంతమాత్రాన బ్యాంకులు ప్రభుత్వ శాఖలు కాదు. ఎవరి హక్కులనయినా పరిరక్షించాల్సి వస్తే అది డిపాజిట్ దార్ల హక్కుల్ని. రాజకీయ నాయకుల హక్కుల్ని కాదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అసలు జవాబుదారీ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పధకాలు ప్రవేశపెట్టి బ్యాంకుల్ని రుణాలు ఇవ్వమని ఒత్తిడి తెస్తే అన్ని సందర్భాల్లో ఆచరణ సాధ్యం కాదు. ఆ పధకం బ్యాంకు రుణ నిబంధనలకు అనుగుణంగా వుందో లేదో ముందుగా చూడాలి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి రుణ చెల్లింపు చరిత్ర చూడాల్సి వుంది. ఇంకా ఎన్నో అంశాలు పరిగణన లోకి తీసుకోవాల్సి వుంది. అంతేగాని దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఆటోమేటిక్ గా అర్హత ఉంటుందని భావించటం పొరపాటు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పధకాలు ప్రకటించేముందు కూలంకషంగా బ్యాంకులతో చర్చించాలి. అవసరమయితే కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ముందస్తు అనుమతి తీసుకోవాలి.
ప్రభుతంలో వున్న పెద్దలు ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే ఈ సంఘటనను ఖండించాలి. ఒకటి,రెండు రోజుల్లో ప్రాధమిక నివేదికను తెప్పించుకొని దీనికి బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఆ తర్వాత కాలపరిమితిలో పూర్తి విచారణ జరిపి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు ప్రభుత్వం చేపట్టలేదంటే ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు ఈ దుండగులతో కుమ్మక్కయ్యారని భావించాల్సి వుంది. ఇప్పుడు చూడబోతే అదే జరిగినట్లు తెలుస్తుంది. కేంద్ర ఆర్ధికమంత్రి స్వయానా కల్పించుకొని రాష్ట్ర ఆర్ధిక మంత్రితో మాట్లాడటంతో కొన్ని కంటితుడుపు చర్యలు చేపట్టవచ్చు. కాని పైన రాసిన పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించకపోతే ఇది బ్యాంకింగ్ వ్యవస్థకే ప్రమాదం పొంచివుందని మరిచిపోవద్దు.
డిపాజిట్ దార్లు, యూనియన్ ప్రతినిధులు కలిసి ఉద్యమించాలి
ఇది కేవలం బ్యాంకు సిబ్బంది సమస్యగా భావించరాదు. నిబంధనలకు అనుగుణంగా రుణాలు ఇవ్వకపోతే నష్ట పోయేది అంతిమంగా డిపాజిట్ దారులేనని మరిచిపోవద్దు. ప్రభుత్వ ఒత్తిడితో, బెదిరింపులతో, అసహ్య నిరసనలతో లొంగిపోయి రుణాలు ఇస్తే నష్టం ఎవరికి? ఒకవైపు నిబంధనలు పాటించనందుకు బ్యాంకు సిబ్బంది క్రమశిక్షణకు గురికావటంతో పాటు, అంతిమంగా నష్ట పోయేది బ్యాంకు ఖాతాదారులేనని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రభుత్వం కూడా అదివరకటిలాగా బ్యాంకుల్ని రక్షిస్తాయని చెప్పలేము. ప్రజల ఆలోచనల్లో కూడా చాలా మార్పులొచ్చాయి. ఎయిర్ ఇండియాకు నష్టాలొస్తే మా టాక్స్ డబ్బులు ఎందుకు ఉపయోగిస్తున్నారని అడుగుతున్నారు. అదే వాదన బ్యాంకులపై కూడా చేస్తే నష్టపోయేది సిబ్బందితో పాటు డిపాజిట్ దారులు కూడా అని గమనించాలి. నష్టపోవటానికి ఎవరుకారణం అనేదానికన్నా తిరిగి పునరుజ్జీవనం పొందటానికి అదివరకటి వాతావరణం లేదని అందరం గుర్తించాలి. దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. నష్టాల్లోకి వెళ్ళిన తర్వాత వాద ,ప్రతివాదాల పర్యవసానం కన్నా అసలు ముందుగానే కడు జాగరూకతతో డిపాజిట్ దారులు ఉండాల్సిన అవసరం వుంది.
యూనియన్ ప్రతినిధులు ఈ విషయమై డిపాజిట్ దారుల్ని కదిలించే కార్యక్రమాలు చేపట్టాలి. డిపాజిట్ దారులు, యూనియన్ ప్రతినిధులు భుజం ,భుజం కలిపి నడవాలి. ప్రజా చైతన్యం ఒక్కటే ఈ దుస్తితి నుండి కాపాడగలదు. ఇప్పటికే బ్యాంకులు ఆత్మరక్షణలో వున్నాయి. పనిభారంతో కుంగి పోతున్నాయి. కోర్ బ్యాంకింగ్ సమర్ధవంతంగా నిర్వహించే సమయం ఉండటంలేదు. ప్రభుత్వాలు వాళ్ళ శాఖల ద్వారా చేయాల్సిన పనులన్నీ బ్యాంకుల మీదికి తోసి కులాసాగా కాలం వెల్లబుస్తున్నాయి. ఈ ధోరణి ప్రభుత్వాల్లో మారాలి. బ్యాంకులను వాటి కోర్ బ్యాంకింగ్ పనులు చేసుకునే సమయం ఇవ్వాలి. బ్యాంకులు ప్రభుత్వ శాఖలనే ఆలోచన మానుకోవాలి. అప్పుడే బ్యాంకులు ఆరోగ్యకరంగా వుంటాయి. ఇంకా ఎక్కువగా, సమర్ధవంతంగా ఖాతాదారులకు సేవ చేయగలుగుతాయి. ఇది ఎంత త్వరగా ప్రభుత్వ పెద్దలు, అధికారులు గమనిస్తే అంత ఆర్ధికరంగానికి మేలు చేసినవారవుతారు.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: State terrorism on banks in andhra pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com