Royal challengers Bangalore : ఐపీఎల్ లో బెంగళూరు బలమైన జట్లలో ఒకటి. ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోకపోయినప్పటికీ ఈ జట్టుకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అన్ బాక్స్ వేడుక నిర్వహిస్తారు. దానికి వేలాదిమంది బెంగళూరు అభిమానులు తరలివస్తారు. “ఈసాలా కప్ నమదే” అంటూ గట్టిగా నినాదాలు చేస్తారు.. వాస్తవానికి ఇంకే జట్టుకు కూడా ఇంతలా అభిమానులు ఉండరు. ఉదాహరణకు చెన్నై, బెంగళూరు జట్లను తీసుకుంటే.. ఇవి చెరి ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచాయి. ఐపీఎల్ లో అత్యంత విలువైన జట్లుగా పేరుపొందాయి. ఈ జట్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోలేని బెంగళూరుకు ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే మామూలు విషయం కాదు. చివరికి తమ జట్టు ఐపిఎల్ ట్రోఫీ దక్కించుకోవాలని కోరుతూ బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లు బెంగళూరు జట్టు జెర్సీ ధరిస్తే ఉచితంగా ప్రయాణం సదుపాయం కల్పిస్తామనే ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. దీనిని బట్టి బెంగళూరు అభిమానులకు తమ జట్టు అంటే ఎంతటి ప్రేమో అర్థం చేసుకోవచ్చు.
Also Read : విరాట్ అవుట్ అయ్యాడని గుక్క పెట్టి ఏడ్చింది..
వింటేజ్ ఆర్సీబీ
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓడిపోవడంతో.. బెంగళూరు జట్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు చేస్తున్నారు.. తొలి రెండు మ్యాచ్లలో బెంగళూరు సాధించిన విజయం గాలివాటమని వ్యాఖ్యానిస్తున్నారు. మూడో మ్యాచ్లో పరాజయం పాలు కావడంతో వింటేజ్ ఆర్సిబి తిరిగి వచ్చేసిందని విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై బెంగళూరు అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు..” బెంగళూరు అనామకమైన జట్టు కాదు. బలమైన కోల్ కతా ను, చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. అందువల్లే నిన్నటిదాకా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగింది. ఇప్పుడు గుజరాత్ జట్టుతో ఓడిపోవడం వల్ల మూడో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ బెంగళూరు జట్టును తక్కువ అంచనా వేయవద్దు. ఒక్క ఓటమితో జట్టును చులకన చేయవద్దు. బెంగళూరు పడి లేచిన బెబ్బులి లాగా ఆడుతుంది. ఈసారి కప్ కూడా కొడుతుందని” సోషల్ మీడియా వేదికగా బెంగళూరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ” బెంగళూరు జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని.. ఈసారి బెంగళూరు జట్టును విజేతగా నిలుపుతారని.. ఇందులో ఎవరూ ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. విజేతగా నిలిచే ముందు ఇలాంటి విమర్శలు బెంగళూరు జట్టుకు దిష్టి తీస్తాయని” సోషల్ మీడియాలో బెంగళూరు అభిమానులు పేర్కొంటున్నారు.
Also Read : RCB పై ఇతడి అభిమానం వేరే లెవెల్..