MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని శకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. కెప్టెన్ కూల్ గా ప్రపంచ క్రికెట్లో కీర్తి అందుకున్న ధోనీ.. ఎన్నో ఘనతలు సాధించాడు. ప్రపంచంలో ఇప్పటికీ బెస్ట్ ఫినిషర్ ధోనీయే అని సహరుడు కోహ్లీ తాజాగా వ్యాఖ్యానించడమే ధోనీ స్టామినాకు నిదర్శనం.

తన కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అంధించిన ధోనీ.. తన పేరిట కూడా ఎన్నో రికార్డులు లిఖించుకున్నాడు. ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో వన్డే ప్రపంచ కప్ అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తుంది. దీంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. మాజీ కెప్టెన్ ధోనీ.. ఈ మూడు ట్రోఫీలనూ గెలుచుకొని సత్తా చాటాడు. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లు నెగ్గాడు ధోనీ. ప్రపంచంలో ఈ మూడు ట్రోఫీలను నెగ్గిన ఏకైక కెప్టెన్ కూడా ధోనీ మాత్రమే కావడం విశేషం.
అలాంటి ధోనీ.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. రిటైర్ అయిన తర్వాత కూడా టీమిండియాకు తన అమూల్యమైన సేవలు అందించడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 17 నుంచి ఆరంభం కాబోతున్న టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్న భారత జట్టుకు ధోనీ మెంటార్ గా వ్యవహరించబోతున్న సంగతి తెల్లిసిందే. బీసీఐ కోరడం.. ధోనీ అంగీకరించడం జరిగిపోయాయి.
ఇప్పుడు తాజా కబర్ ఏమంటే.. టీ20 వరల్డ్ కప్ లో తన సేవలు అందించినందుకుగానూ.. బీసీసీఐ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు ధోనీ! ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్వయంగా వెల్లడించాడు. ‘భారత జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నందుకు ధోనీ డబ్బులేమీ తీసుకోవట్లేదు అని సౌరవ్ పేర్కొన్నాడు. దీంతో.. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ధోనీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని గొప్ప మనసుకు సెల్యూట్ కొట్టాల్సిందేనని అంటున్నారు.