MS Dhoni: అప్పటికే అతడు టీమిండియాలో అత్యంత విజయవంతమైన సారధి. కళ్ళు చెదిరే డబ్బు. వద్దంటున్నా వస్తున్న అవకాశాలు.. తరాలు కూర్చుని తిన్నా తరగని సంపద. ఎక్కడికి వెళ్లినా విపరీతమైన అభిమానులు.. ఇక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆదరించే మనుషులు.. సాధారణంగా ఇన్ని సౌలభ్యాలు ఉంటే ఏ మనిషి కూడా మరొక దానిని కోరుకోడు. ఇంకొక దానికోసం ఆరాటపడడు. ఈ స్థాయిలో డబ్బు, పేరు, ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ధోని ఆత్మసంతృప్తి కోసం ఆరాటపడ్డాడు. తనకు నెరవేరని కోరికగా ఉన్న దానిని తీర్చుకున్నాడు.
Also Read: రెచ్చగొట్టిన బ్రూక్.. పద్ధతిగా ఇచ్చిపడేసిన పంత్.. అట్లుంటది మరీ (వీడియో)
ధోని క్రికెటర్ కాకముందుకు రైల్వే శాఖలో పని చేశాడు. ఆ తర్వాత క్రికెటర్ అయ్యాడు. టీమ్ ఇండియాకు అత్యంత విజయవంతమైన సారధిగా ఆవిర్భవించాడు. ఈ కోణాలు ప్రజలందరికీ తెలుసు. కానీ ధోనిలో తెలియని మరో కోణమే ఇండియన్ ఆర్మీలో అతడు పని చేయడం. ఆర్మీలో అతడు పని చేయడానికి బలమైన కారణాలు చాలా ఉన్నాయి. చిన్నప్పటినుంచి ధోనికి సైన్యంలో పని చేయాలని కోరిక బలంగా ఉండేది. కాకపోతే అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి అప్పటికి సహకరించకపోవడంతో రైల్వే శాఖలో పనిచేశాడు.. భారత జట్టుకు వన్డే వరల్డ్ కప్ అందించిన తర్వాత ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. అయితే ఈ హోదాను తనకు దక్కిన గౌరవంగా ధోని ఎప్పుడూ చూడలేదు. దానికి తగ్గట్టుగానే అతడు భారత సైన్యంలో శిక్షణ తీసుకున్నాడు..
భారత సైన్యంలో శిక్షణ తీసుకున్న అనంతరం ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏకంగా ఐదుసార్లు పారాచూట్ జంప్ లు చేశాడు. ఈ ఘనత అందుకున్న తొలి క్రీడాకారుడిగా అతడు రికార్డు సృష్టించాడు. పారాట్రూప్ విభాగంలో అతడు క్వాలిఫై అయ్యాడు. 2019లో జమ్మూ కాశ్మీర్ వెళ్లిపోయి సైనికులతో గస్తీ కాశాడు. 15 రోజులపాటు పెట్రోలింగ్ నిర్వహించాడు. గార్డ్ డ్యూటీ లో కూడా పాల్గొన్నాడు. పోస్ట్ డ్యూటీ విధులు నిర్వహించాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ధోని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించాడు. ఏకే 47 భుజాన మోసాడు. ఆరు హ్యాండ్ గ్రెనేడ్ లను అతను తీసుకెళ్లాడు.
సమయం దొరికినప్పుడల్లా ధోని సైన్యంతో మమేకమయ్యాడు. తను ఒక సెలబ్రిటీ అనే విషయాన్ని వారితో కలిసిపోయాడు. వారు తిన్న ఆహారమే తిన్నాడు. వారితో కబుర్లు చెప్పాడు. తన ఘనతలు.. తన విజయాలు కాకుండా సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకున్నాడు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఆపదల గురించి కూడా సైనికుల నుంచి తెలుసుకున్నాడు. అందుకే ధోనిని అశేష భారత ప్రజలు అభిమానిస్తారు. ఆరాధిస్తారు. క్రికెటర్లు ఎందరో ఉండొచ్చు. ఇంకా ఎందరో రావచ్చు. భారత క్రికెట్ చరిత్రలో ధోనికి మాత్రం ప్రత్యేక స్థానం.