Ben Duckett: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. పైగా ఈ ఆట ఇంగ్లాండ్ దేశంలో పుట్టింది. క్రికెట్ ఆడే ఆటగాళ్లు నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాల్సి ఉంటుంది. మైదానంలో దిగిన నాటి నుంచి మొదలు పెడితే బయటికి వచ్చేవరకు ప్రతి సందర్భంలోనూ క్రీడా స్ఫూర్తిని కలిగించాలి, ప్రదర్శించాలి కూడా. కానీ ఈ విషయాన్ని ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్ బెన్ డకెట్ మర్చిపోయినట్టు కనిపిస్తున్నాడు. అంతేకాదు, జెంటిల్మెన్ గేమ్ కు దర్జాగా అపప్రతిష్టను తీసుకొచ్చాడు. ఇతడు చేసిన పని ఇందుకు కారణం కాగా.. ఇప్పటికే విచారణ మొదలైంది. ఈ విచారణలో అతడు గనుక తప్పు చేసినట్టు తేలితే కెరియర్ మొత్తం మటాష్ అయ్యే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు విఫల ప్రదర్శన కొనసాగుతోంది. ఇందుకు ఇంగ్లాండు జట్టు ప్లేయర్ల బాధ్యతరాహిత్యం ప్రధాన కారణం. ముఖ్యంగా రెండవ టెస్టు ఓటమి తర్వాత.. మూడవ టెస్ట్ నిర్వహించడానికి దాదాపు 9 రోజుల వరకు సమయం లభించింది. ఈ తొమ్మిది రోజుల సమయాన్ని ఇంగ్లాండు జట్టు ప్లేయర్లు సమర్థవంతంగా వినియోగించుకుంటే బాగుండేది. కానీ వారు ప్రాక్టీసును పక్కనపెట్టారు. జిమ్ సెషన్ ను కూడా వద్దనుకున్నారు. చివరికి క్వీన్స్ లాండ్ బీచ్ లో తాగి, ఊగిపోయారు. అయితే ఇలా బీభత్సంగా తాగిన ప్లేయర్ల జాబితాలో ఇంగ్లాండు ఓపెనర్ బెన్ డకెట్ ముందు వరసలో ఉన్నాడని తెలుస్తోంది. ఇతడు తాగిన మైకంలో కనీసం జట్టు బసచేసిన హోటల్ గదికి కూడా వెళ్లలేకపోయినట్టు సమాచారం.
బ్రిస్బెన్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు సన్ షైన్ కోస్ట్ పట్టణానికి వెళ్లారు. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. అయితే ప్లేయర్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలోనే రిఫ్రెష్మెంట్ గా ఉంటుందని ఇలాంటి పార్టీ ఏర్పాటు చేసినట్టు మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది.
ఇలా తాగిన ఇంగ్లాండ్ ప్లేయర్లలో డకెట్ ఎక్కువ మైకంలో మునిగిపోయాడని.. కనీసం నడిచే స్థితిలో కూడా అతడు లేడని ఒక వీడియో ప్రసారమవుతోంది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పందించింది. ” సామాజిక మాధ్యమాలలో కనిపిస్తున్న వీడియో మా దృష్టికి కూడా వచ్చింది. అతని ప్రవర్తన మీద స్పష్టమైన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ అతడు గనుక మితిమీరినట్టు ప్రయత్నిస్తే తదుపరి చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయని” ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసినట్టు వార్తలు ప్రసారమవుతున్నాయి.
ఇంగ్లాండ్ జట్టులో అత్యంత విశ్వసనీయమైన బ్యాటర్లలో డకెట్ ఒకడు. అయితే ప్రస్తుత యాషెస్ సిరీస్ లో అతడు 16.16 సగటుతో 97 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ లో అతని హైయెస్ట్ స్కోర్ 29 పరుగులు మాత్రమే. 31 సంవత్సరాల వయసు ఉన్న డకెట్ సరిగా ఎన్ని సంవత్సరాల క్రితం 2017, 18 లో ఓ సిరీస్ కోసం లయన్స్ జట్టు తరఫున ఆడాడు. ఆ సమయంలో పెర్త్ లోని అవెన్యూ బార్ లో జేమ్స్ అండర్సన్ మీద మద్యం పోశాడు. అతడు చేసిన ఆ పని పట్ల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది. డకెట్ కు జరిమానా విధించింది. కొద్దిరోజులపాటు జట్టు నుంచి సస్పెన్షన్ కూడా చేసింది.