Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అంటేనే ఒక రకమైన విమర్శ ఉంది. అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్త వరకు ఒకటే దూకుడు. ముందుగా భయపెడతారు. ఆ భయాన్ని రాజకీయంగా వాడుకుంటారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో కూడా జగన్ భయం పనిచేసింది. ఎంతలా అంటే ప్రభుత్వం టెండర్కు పిలిస్తే ఒకే ఒక్కరు ముందుకు రావడం విశేషం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. నాలుగు కాలేజీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే.. ఒకే కాలేజీకి దరఖాస్తు రావడం విశేషం. అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎంత భయపడుతున్నారో ఇట్టే తెలిసిపోతోంది.
* గత కొద్ది రోజులుగా వివాదం..
ప్రభుత్వ మెడికల్ కాలేజీల( government medical colleges ) నిర్వహణకు సంబంధించి గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఐదింటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. మిగతా పది మాత్రం ఇంకా పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే వాటి నిర్మాణం పూర్తి చేయడం కష్టమని భావించిన చంద్రబాబు సర్కార్.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పూర్తి చేయాలని భావించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీచేసింది. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఎవరైనా మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వస్తే వారిని జైల్లో పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలు గట్టిగానే పనిచేసినట్టు కనిపించాయి. ఒక్క ఆదోని కాలేజీకి మాత్రమే సింగిల్ గా దరఖాస్తు వచ్చింది.
* హెచ్చరికల ప్రతికూలత..
ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. గతంలో పరిశ్రమలు.. పారిశ్రామిక ప్రతినిధులను వైసీపీ నేతలు బెదిరించారన్న విమర్శ ఉండేది. కానీ గత 18 నెలల కాలంలో అదే పరిశ్రమల ప్రతినిధులను, యాజమాన్యాలను కలిసి భరోసా కల్పించింది కూటమి ప్రభుత్వం. దీంతో పెట్టుబడుల రాక మొదలైంది. ఇటువంటి తరుణంలో ఒక బాధ్యతాయుతమైన పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి.. బెదిరింపులకు దిగడం అనేది సహేతుకం కాదు. అయితే నిన్ననే మెడికల్ కాలేజీల నిర్వహణకు సంబంధించిన దరఖాస్తులు రాకపోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. కానీ ఆ పార్టీ వైఖరిని విద్యాధికులు, తటస్తులు గమనిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆ పార్టీకి సహేతుకం కాదు. ప్రజలు మరింత వ్యతిరేక భావన పెంచుకునే అవకాశం ఉంది. ముమ్మాటికీ ఇది ఆ పార్టీకి నష్టమే.