England Cricketers: వ్యసనం అనేది ఏడు ఊర్ల ప్రయాణం అంటారు.. ఇది మిగతా వారికి ఏమో గాని.. ఇంగ్లాండ్ క్రికెటర్లకు సరిగ్గా సరిపోతుంది. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం విపరీతమైన ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయిన ఆ జట్టు.. మూడో మ్యాచ్లో కూడా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు సంబంధించిన ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు మొత్తం పీకల దాకా మద్యం తాగారు. అంతేకాదు, కనీసం జిమ్ సెషన్ కు కూడా హాజరు కాలేకపోయారు. కెప్టెన్ స్టోక్స్ నుంచి మొదలు పెడితే డకెట్ వరకు అందరూ పీకల దాకా మద్యం తాగారు. తాగిన మైకంలో ఎంజాయ్ చేశారు. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు రెండవ టెస్టు ఓడిపోయిన తర్వాత మూడవ టెస్టుకు దాదాపు తొమ్మిది రోజుల వరకు గ్యాప్ లభించింది. ఈ గ్యాప్ లో క్రికెటర్లు ఏకంగా ఆరు రోజులపాటు మద్యం మత్తులోనే మునిగిపోయారు. దీనికి సంబంధించి బిబిసి ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది…
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో నోసా బీచ్ రిసార్ట్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మద్యం మత్తులో మునిగిపోయారంటూ బిబిసి ఒక కథనాన్ని ప్రచారం చేసింది. బీచ్ రిసార్ట్లో ప్లేయర్లు కేవలం పార్టీలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. జట్టు ప్లేయర్లు జిమ్ సెషన్ లో పాల్గొనవలసి ఉండగా.. కేవలం ముగ్గురు ప్లేయర్లు మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై ఇంగ్లాండు క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ విచారణకు ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్లేయర్లు విచ్చలవిడిగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని అతడు పేర్కొన్నాడు. విచారణలో గనుక ఇవన్నీ నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. “పరిణామాలు చూస్తుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. జట్టు ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఇలాంటి సమయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. విచారణకు ఆదేశించాము. అందులో నిజాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని” రాబ్ కీ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.