RCB owner 2025 : సాధారణంగా ఐపీఎల్లో ఒక జట్టు విజేతగా నిలిస్తే.. ట్రోఫీని కెప్టెన్ అందుకుంటాడు. ఆ తర్వాత ఆ ట్రోఫీని యాజమాన్యానికి అందిస్తాడు. గతంలో ఐపీఎల్ విజేతలు ఇదే పద్ధతిని పాటించాయి. మంగళవారం రాత్రి ట్రోఫీని అందుకున్న తర్వాత.. కన్నడ జట్టు కెప్టెన్ ఐపీఎల్ ట్రోఫీని యాజమాన్యానికి అందించాడు. ఆ ట్రోఫీని అందుకున్న వారిలో విజయ్ మాల్యా లేదా అతడి కుమారుడు కనిపించలేదు. తనకు సంబంధించిన బంధు పరివారం కూడా అక్కడ తచ్చాడ లేదు. దీంతో బెంగళూరు జట్టు యజమాని ఎవరు? విజయ్ మాల్యాకి అందులో వాటా లేదా? ఒకవేళ వాటా లేకపోతే ఇప్పుడు బెంగళూరు జట్టును ఎవరు నడిపిస్తున్నారు? ఆటగాళ్లకు ఎవరు పెట్టుబడి పెడుతున్నారు? కోట్లకు కోట్లు ఎవరు ఖర్చు పెడుతున్నారు? అనే ప్రశ్నలు సగటు ఐపీఎల్ అభిమానిలో మెదులుతున్నాయి.
వాస్తవానికి కన్నడ జట్టు ఈ సీజన్లో కాకుండా.. గతంలో మూడు పర్యాయాలు ఫైనల్ దాకా వెళ్ళింది. కానీ ట్రోఫీని గెలుచుకునే సమయంలో ఓటమిపాలైంది.. ఇక 2020, 21 లో ప్లే ఆఫ్ ఆడింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 2008లో బెంగళూరు జట్టును అప్పటి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ విజయ్ మాల్యా 111.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అప్పట్లో అది రెండవ అత్యధిక బిడ్. అయితే 2016లో రుణాలు ఎగవేశాడు అనే కారణంతో విజయ్ మాల్యాపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడు విదేశాలకు పారిపోయాడు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అనే అభియోగాలతో అతనిపై మన దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. వాటికి సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. విదేశాలలో కూడా విజయ్ మాల్యా కేసులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు స్వదేశానికి రావడానికి సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది.. ఇక ప్రస్తుతం బెంగళూరు జట్టు యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ ఆధీనంలో ఉంది.
Also Read : అంత ఒత్తిడిలోనూ సాల్ట్ అద్భుతమైన క్యాచ్.. బిత్తర పోయిన పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య!: వైరల్ వీడియో
యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ.. బెంగళూరు జట్టుకు ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. పైగా అది ఈ సీజన్లో ఏకంగా ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం గత ఏడాది బెంగళూరు జట్టు బ్రాండ్ విలువ ఏకంగా 1013.17 కోట్లకు చేరుకుంది. ఇక ఈ సంవత్సరం విజేతగా నిలిచిన నేపథ్యంలో బ్రాండ్ విలువ అంతకంతకు పెరుగుతుందని తెలుస్తోంది. 2024 వరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయినప్పటికీ బెంగళూరు బ్రాండ్ విలువ పెరగడం విశేషం. బెంగళూరు బ్రాండ్ విలువ దాదాపు ముంబై జట్టు తర్వాత ఉండడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.. యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది. గతంలో ఈ కంపెనీని యునైటెడ్ బ్రువరిస్ అని పిలిచేవారు. యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ ప్రపంచంలోనే స్పిరిట్ ఉత్పత్తి చేసే రెండవ అతిపెద్ద సంస్థ.. యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆల్కహాలిక్ పానీయాలను తయారుచేస్తుంది. ప్రపంచంలోనే ప్రముఖ మద్యం కంపెనీ అయిన డియాజియోకు ఉప కంపెనీగా యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ప్రస్తుతం యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా హీనా నాగరాజన్ కొనసాగుతున్నారు.. ఇక ఈ కంపెనీకి మెక్ డోవల్స్ నెంబర్ వన్, రాయల్ చాలెంజ్ , సిగ్నేచర్ వంటి విజయవంతమైన బ్రాండ్లు ఉన్నాయి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ప్రమోట్ చేస్తున్న యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ కంపెనీ నికర ఆస్తుల విలువ 98, 891 కోట్లుగా ఉంది. యునైటెడ్ స్పిరిట్ కంపెనీలో విజయ్ మాల్యాకు మైనర్ వాటాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు స్పష్టత లేదు. మరోవైపు బెంగళూరు జట్టుతో అతనికి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది.